Monday, December 23, 2024

భారత్ అమెరికా బంధం అపరిమితం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ ః భారత్ అమెరికా బంధం అపరిమితం అని , ఎంత దూరం అయినా విస్తరించుకుంటాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంతగా అపూర్వస్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య స్నేహం చంద్రయాన్ మాదిరిగా చంద్రుడి వద్దకు, చంద్రుడిని దాటుకుని కూడా వెళ్లుతాయని జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఇక్కడి ఇండియా హౌస్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఇండో అమెరికన్లను ఉద్ధేశించి ఆదివారం మాట్లాడారు. ఇక్కడి భారతీయ రాయబార కార్యాలయం జైశంకర్ ఆగమనం నేపథ్యంలో ‘ ఏర్పాటు చేసిన స్నేహబంధం విజయపథ ఘట్టం కార్యక్రమంలో ప్రసంగించారు. అమెరికాలో పలు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఇక్కడి భారతీయ సంతతి వారితో ఇక్కడి ఈ సభలో ముచ్చటించడం సంతోషకరంగా ఉందని జైశంకర్ తెలిపారు.

ఇండియా హౌస్‌కు ఇంతకుముందెన్నడూ లేని సంఖ్యలో ఇండో అమెరికన్లు తరలివచ్చారు. ఇక్కడ అమెరికాలో ఓ పాపులర్ పాటలో మార్మోగినట్లు , ఇరుదేశాల మధ్య బంధం మరింత బహుముఖం అవుతుంది. అమెరికా సహకారం లేకపోతే భారతదేశపు సారధ్యంలో జరిగిన జి 20 సమ్మిట్ విజయవంతం కాకపోయ్యేదన్నారు. జి సదస్సు సక్సెస్‌కు అమెరికా బాగా సహకరించిందనేది వాస్తవం, ఈ విషయాన్ని అమెరికాలో పైగా రాజధాని వాషింగ్టన్‌లో బహిరంగంగా ప్రకటిస్తున్నానని సభికుల హర్షధ్వానాల నడుమ స్పష్టం చేశారు. ఇరుదేశాల మానవీయ సంబంధాలు పటిష్టంగా ఉండటం వల్లనే ద్వైపాక్షిక సహకారం మరింత విశిష్టం అయిందన్నారు. పలు దేశాల నడుమ వాణిజ్య వ్యాపార లావాదేవీలు ఉంటాయి. పరస్పరం విభిన్న రాజకీయాలకు దిగుతూ ఉంటాయి. భౌగోళిక ప్రాంతీయ ఉనికిని చాటుకుంటాయి. సైనిక సంబంధాలు వీటితో పాటు సంయుక్త విన్యాసాలు సాగుతాయి. సాంస్కృతిక విషయ వినిమయాలు నెరపుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నింటిని తలదన్నేలాగా చేసేది దేశాల మధ్య ఉండే మానవీయ సంబంధాలు అని జైశంకర్ తెలిపారు.

ఇక్కడి భారతీయ సంతతి పాత్ర అత్యద్భుతం
భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకుని వివిధ వృత్తులలో ఉన్న ప్రవాస భారతీయులు ఇరుదేశాల మధ్య సంబంధాల పటిష్టత దిశలో తమ వంతు కృషి సాగిస్తున్నారని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇది అత్యద్భుతం అని కొనియాడారు. దీని గురించి మాటలలో చెప్పడం కష్టమని , అయితే ఇండో అమెరికన్ల విశిష్ట పాత్రతోనే ఇరుదేశాల నడుమ సంబంధాలు మరింతగా ముందుకు సాగేందుకు అవసరం అయిన ప్రాతిపదికను ఖరారు చేసుకున్నామని తెలిపారు. భారతదేశం ఇప్పుడు మునుపటి భారతదేశంగా లేదని, ఇది విభిన్నమైనదని, ఈ విస్తారితతను అలవర్చుకుందన్నారు.

చంద్రయాన్ 3 వంటి విజయవంత అంతరిక్ష యాత్రల నిర్వహణ సామర్థం గల దేశంగా మారిందనే విషయాన్ని ఇక్కడికి వచ్చిన వారికి తాను చెప్పాల్సిన అవసరం లేదని, ఇతరుల నుంచి కూడా వారు తెలుసుకుని ఉంటారని వివరించారు. ప్రపంచవ్యాప్త కోవిడ్ క్లిష్ట దశలో భారతదేశం కేవలం తమ సొంత దేశ ప్రజల గురించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలకుచేయూత అందించిందని తెలిపారు. ఔషధాలు, సహాయక సామాగ్రి చేరవేత వంటి పలు అంశాలను ప్రస్తావించుకోవచ్చునని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో అత్యంత వేగవంతమైన 5జి ప్రక్రియ కూడా నెలకొందని , ఐటి శాస్త్ర సాంకేతిక రంగంలో పరుగులు తీస్తున్న వైనం దీనితో తేటతెల్లం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News