వాషింగ్టన్ : ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తప్పింది. స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ ప్రత్యేక చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం వహించి రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలించాయి. ఫలితంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆఖరి నిమిషంలో ఆమోదం లభించింది. మొత్తం మీద బిల్లుకు అనుకూలంగా 335 మంది, వ్యతిరేకంగా 91 మంది ఓటు వేశారు. దీంతో ఆఖరి నిమిషంలో ప్రతినిధుల (దిగువ) సభలో ద్రవ్య బిల్లు పాసైంది. దీంతో 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందులు తప్పాయి. అమెరికాలో ఆర్థిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్యబిల్లు ఆమోదం తప్పనిసరి. అక్టోబర్ 1(ఆదివారం) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి లోపు ఈ బిల్లు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అక్టోబర్ 1న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగులకు వేతనాలు, వివిధ పథకాలకు నిధులు అందించడం సాధ్యమవుతుంది. లేదంటే అన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
ఈ ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా తీసుకుని జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు భావించారు. ఈ క్రమం లోనే సరిహద్దు భద్రత ఏజెన్సీతోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం కోత విధించడాన్ని తప్పు పట్టారు. అలాగే రష్యాతో పోరు సాగిస్తున్న ఉక్రెయిన్‌కు నిధులు అందించాలనే బిల్లును కూడా రిపబ్లికన్లు తిరస్కరించారు. దిగువ సభలో మొత్తం 435 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 433 మంది సభ్యులు ఉండగా, వారిలో 221 మంది రిపబ్లికన్ పార్టీవారు. 212 మంది అధికారిక డెమొక్రాట్లకు చెందిన వారు. దిగువ సభలో బైడెన్ సర్కారుకు మెజార్టీ లేక పోవడంతో కీలకమైన ఈ బిల్లుల ఆమోదానికి డెమోక్రాట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎలాగైనా షట్‌డౌన్ పరిస్థితులను నివారించాలనే ఉద్దేశంతో స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ రంగం లోకి దిగారు. ప్రతిపక్ష రిపబ్లికన్లతో చర్చలు జరపగా చివరినిమిషంలో చర్చలు ఫలించాయి. దీంతో రిపబ్లికన్లు స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాల బిల్లుకు మద్దతు ఇచ్చారు. రానున్న 45 రోజులకు సరిపడే నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.