Thursday, December 19, 2024

నేటి నుంచి హైదరాబాద్ సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

ఒక ట్వీట్‌తో ఈ ట్రాక్‌కు అంకురార్పణ
హైదరాబాద్ ట్రాక్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది
దక్షిణ కొరియా తర్వాత రెండో సోలార్ రూఫ్ కవర్ సైకిల్ ట్రాక్ ఇదే
ట్రాక్‌కు రెండు వైపులా రక్షణ, భద్రత ఏర్పాట్లు చేపట్టాం:  పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ సైక్లింగ్ ట్రాక్ నేటి నుంచి అందుబాటులోకి వస్తుందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఆగస్టు 2022 సంవత్సరంలో సౌత్ కొరియాలో సోలార్ ప్యానెల్ కవర్ సైకిల్ ట్రాక్‌కు సంబంధించి వచ్చిన ఒక ట్వీట్‌తో ఈ ట్రాక్‌కు అంకురార్పణ జరిగిందన్నారు. ప్రస్తుతం సంవత్సరం వ్యవధిలోనే 23 కి.మీ.ల సోలార్ ట్రాక్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని కెటిఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నార్సింగి వద్ద సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ (సోమవారం) నుంచి మొత్తం 23 కి.మీ.ల ట్రాక్ (46 కిమీ రౌండ్ ట్రిప్) 24 X 7, ఏడాది పొడవునా (365 రోజులు) తెరిచి ఉంటుందన్నారు. పింక్ లైన్ నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టిఎస్‌పిఏ) వరకు 8.5 కి.మీల మేర విస్తరించి ఉందని కెటిఆర్ తెలిపారు. బ్లూ లైన్ ట్రాక్ నార్సింగి హబ్ నుంచి కొల్లూరు వరకు 14.5 కి.మీల మేర విస్తరించి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సైక్లింగ్ ట్రాక్‌లు ఉన్నప్పటికీ, హైదరాబాద్ ట్రాక్ రూపకల్పన ఎంతో ప్రత్యేకతతో కూడుకుందన్నారు.

ఈ సైకిల్ ట్రాక్‌కు ఐదు యాక్సెస్ పాయింట్లు
ప్రపంచంలో దక్షిణ కొరియా తర్వాత హైదరాబాద్ రెండో సోలార్ రూఫ్ కవర్ సైకిల్ ట్రాక్ ఇది కెటిఆర్ పేర్కొన్నారు. ఇలాంటప్పుడు దుబాయ్, స్విట్జర్లాండ్‌లో కూడా ఇలాంటివి నిర్మాణంలో ఉన్నాయని, భారతదేశంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ట్రాక్ ఇదేనని ఆయన తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) సోలార్ సైకిల్ ట్రాక్ మూడు (3) ప్రత్యేక లేన్‌లతో కలిగి ఉందన్నారు. ట్రాక్‌కు రెండు వైపులా రక్షణ, భద్రత ఏర్పాట్లను చేశామని ఆయన తెలిపారు. ఇది సైక్లిస్టులకు పూర్తిగా సురక్షితమయ్యిందని కెటిఆర్ పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ సోలార్ సైకిల్ ట్రాక్ కార్ అండ్ సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, సైకిల్ రిపేర్ అండ్ రెంటల్ స్టేషన్లు, ప్రథమ చికిత్స స్టేషన్లు, విశ్రాంతి ప్రాంతాలతో పాటు ఆధునిక సిగ్నలింగ్ వంటి సౌకర్యాలను అందించే ఐదు యాక్సెస్ పాయింట్లను ఈ సైకిల్ ట్రాక్ కలిగి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

త్వరలోనే సైకిల్ అద్దె ఏజెన్సీలు ఖరారు
ఈ సోలార్ సైకిల్ ట్రాక్ 16 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే సోలార్ రూఫ్‌ను కలిగి ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సోలార్‌రూఫ్ లేకపోతే 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కనీసం 52 ఎకరాల భూమి అవసరం అయ్యేదన్నారు. ఈ సోలార్ ప్యానెల్‌కు అయిన ఖర్చు ఆరు సంవత్సరాల్లో, మొత్తం ప్రాజెక్ట్ అయిన ఖర్చును పదిహేను సంవత్సరాల్లో తిరిగి రాబట్టేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆ విధంగా, దీర్ఘకాలంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు స్వచ్ఛమైన విద్యుత్ శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుందన్నారు. భవిష్యత్‌లో ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన సైక్లింగ్ ట్రాక్ గా ఇది నిలుస్తుందని కెటిఆర్ ప్రశంసించారు. కేవలం 18 రోజుల్లో 16,000 సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చన్నారు. నగర సైక్లిస్టులకు ఈ ట్రాక్ 24×7, 365 రోజులు ఉపయోగించుకునేలా లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సైకిల్ ట్రాక్ వెంట ఉన్న సిసిటివిలను 24X7 పర్యవేక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానం చేశామన్నారు. రాబోయే కొద్ది వారాల్లో కొన్ని సైకిల్ అద్దె ఏజెన్సీలు కూడా ఖరారు అవుతాయని కెటిఆర్ తెలిపారు.

ఫేజ్ – 2లో మరిన్ని సౌకర్యాలు
ఫేజ్ – 2లో భాగంగా నార్సింగి హబ్లో స్కేటింగ్ రింక్లు, టెన్నిస్ కోర్ట్లు, బ్యాడ్మింటన్ కోర్టు, స్పోర్టింగ్ రిటైల్‌తో పాటు మరిన్ని క్రీడా సౌకర్యాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కెటిఆర్ తెలిపారు. ఇది భారతదేశంలో ఒక రకమైన క్రీడా కేంద్రంగా మారుతుందన్నారు. హైదరాబాద్ సైక్లింగ్ ఔత్సాహికులు, ఏఎస్‌పి హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ (హెచ్‌సిఆర్) హైదరాబాద్ సైక్లిస్ట్ల గ్రూప్ (హెచ్‌సిజి), సెల్వన్ సంతాన, యాక్టివ్ మొబిలిటీకి చెందిన రవి అండ్ రవీంద్ర నండూరి యాక్టివ్ మొబిలిటీని అవిశ్రాంతంగా ప్రోత్సహిస్తున్నారని కెటిఆర్ తెలిపారు. ఈ ప్రయత్నంలో మా భాగస్వామి అయిన కెఎంవి గ్రూప్‌కు చెందిన పృథ్వీకి మంత్రి కెటిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ సింగిల్ లైన్ మూవింగ్ సైకిల్స్ (గిన్నిస్ వరల్ రికార్డ్ అటెంప్ట్) 2024 సంవత్సరానికి కొత్తగా నిర్మించిన వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌లో 3000 మంది సైక్లిస్టులతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలని సంకల్పించిందని కెటిఆర్ తెలిపారు. దీనిని నిజం చేసినందుకు హైదరా బాద్ గ్రోత్ కారిడార్ (హెచ్‌జిసిఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) మొత్తం ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్ సిబ్బందికి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్ పర్సన్ రేఖ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మేయర్ మహేందర్ గౌడ్ లతో పాటు ఎంఏయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హెచ్‌జిసిఎల్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఎం.సంతోష్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సీజిఎం రవీందర్ తదితరులు హాజరయ్యారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News