న్యూఢిల్లీ : దేశంలో కొన్ని ప్రాంతాలలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసిస్ కదలికలను గుర్తించి ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో పట్టుబడ్డ వారిలో ముగ్గురు ఇంజనీర్లు అని, బాంబుల తయారీలో నిపుణులు అని నిర్థారణ అయినట్లు పోలీసు వర్గాలు సోమవారం తెలిపాయి. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం సీనియర్ అధికారి హెజ్‌జిఎస్ ధాలీవాల్ దీని గురించి సమాచారం వెలువరించారు. ఐసిస్‌కు చెందిన మెహమ్మద్ షానవాజ్ ఇప్పుడు అరెస్టు అయ్యాడు. ఈ వ్యక్తి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) పెద్ద ఎత్తున గాలిస్తోంది. గత నెలలోనే నియా వర్గాలు ఈ వ్యక్తిని పట్టిస్తే లేదా సమాచారం అందిస్తే రూ 3 లక్షల వరకూ పారితోషికం ఇస్తామని ప్రకటించింది. మరో ఇద్దరి పట్టివేతకు కూడా ఆఫర్లు వెలువరించింది. దేశంలో కొన్ని చోట్ల జరిగిన బాంబు పేలుళ్లకు ఈ ముగ్గురు బాధ్యులని దర్యాప్తు క్రమంలో వెల్లడైంది.
ఇప్పుడు అరెస్టు అయిన మరో ఇద్దరు షానవాజ్ అనుచరులు అని వీరిని రిజ్వాన్ అష్రఫ్‌గా, అర్షాద్ వార్సిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. షానవాజ్‌ను ఢిల్లీలోని జైత్పూర్‌లో పట్టుకున్నారు. మిగిలిన వారిని యుపిలోని లక్నో, మొరాదాబాద్‌లలో అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టు అయిన వారిలో షానవాజ్ జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన వాడు . మైనింగ్ ఇంజనీర్ . బాంబుల తయారీ, పేల్లుళ్లలో ఆరితేరాడని వెల్లడైంది. ఆయన భార్య హిందువు. పెళ్లి తరువాత ఇస్లాం స్వీకరించింది. ఆమె ఇప్పుడు ఫరారీలో ఉందని అధికారులు తెలిపారు. కాగా రిజ్వాన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు అలీగఢ్ వర్శిటీలో చేశాడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో పిహెచ్‌డి చేస్తున్నాడు. యుపికి చెందిన రిజ్వాన్ అష్రఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరు. మత గురువుగా కూడా శిక్షణ పొందాడు. చాలా చోట్ల ఐసిస్ శక్తులు స్లీపింగ్ సెల్స్‌గా ఉంటూ భారీ స్థాయిలో విరాళాల సేకరణ, తరువాత విధ్వంసాలకు దిగాలని కుట్రలతో ఉన్నాయని వెల్లడయినట్లు నిఘా వర్గాలు పలుసార్లు తెలిపాయి.