మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎపి సిఎం జగన్ పై , ఎపి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయమై నోటీసులు ఇచ్చేందుకు సోమవారం ఉదయం నుండి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద పోలీసులు ప్రయత్నించారు. అయితే టిడిపి కార్యకర్తలు పోలీసులను బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. సోమవారం రాత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. నోటీసులు తీసుకోకుండా తలుపులు వేసుకొని బండారు సత్యనారాయణమూర్తి నిరసనకు దిగారు. తలుపులు బద్దలు కొట్టి మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సిఎం జగన్ ను దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసి గుంటూరుకు పోలీసులు తరలించారు. బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద సోమవారం ఉదయం నుండి హైడ్రామా కొనసాగుతుంది. పోలీసులను టిడిపి శ్రేణులు సాయంత్రం వరకు నిలువరించాయి. టిడిపి శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి ఇంట్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సిఎం జగన్‌పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల కేసులపై బండారు సత్యనారాయణమూర్తి తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని సోమవారం ఉదయం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి చేరుకన్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి సంఘీభావం ప్రకటించారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడ బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి వచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఉదయానికి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి తిరిగి వస్తారని అయ్యన్నపాత్రుడు ధీమాను కనబర్చారు.