న్యూఢిల్లీ : విపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్ ’ లో పగుళ్లు ఉన్నా అవి కూటమి పొత్తుకు భంగం కలిగించ బోవని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ దృఢ విశ్వాసం వెలిబుచ్చారు. అయితే కనీస ఉమ్మడి కార్యక్రమం కన్నా దేశ భవిష్యత్తు గురించి కొత్త ‘విజన్’ విపక్ష కూటమికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గతం గురించి ఆలోచించడం కన్నా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం అవసరమన్నారు. ఇది వ్యక్తిగతం కాకూడదని, గతం నుంచి స్ఫూర్తి చెందనక్కరలేదని వ్యాఖ్యానించారు. అదానీ వ్యవహారం పెద్ద కుంభకోణమని, కానీ దాన్ని నిరూపించేందుకు తగిన డేటా విపక్షాల వద్ద లేదని పేర్కొన్నారు. ఆదానీ వ్యవహారం ఎంతవరకు ప్రజలకు చేరిందో తనకు తెలీదని పేర్కొన్నారు.
ఇప్పుడు పెద్ద సమస్యలపై ఆలోచించాలని, దానివల్ల రేపటి తరానికి ఆశ కలుగుతుందని పేర్కొన్నారు. సిబల్ తన యూట్యూబ్ “దిల్ సే” రెండో ఎపిసోడ్‌లో ఈ వివరాలను వెల్లడించారు. విపక్షాల కూటమి లోని ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీల్లో విభేదాల గురించి అడగ్గా దీన్ని రెండు వేర్వేరు కోణాల్లో చూడాలన్నారు. ఒకటి ఎన్‌డిఎను ఢీకొనడానికి ఇండియా బ్లాక్ ఎలా ముందుకు సాగుతోందో చూడాలని, ఇంకొకటి ఇండియా బ్లాక్ లోని అంతర్గత రాజకీయాలుగా పరిగణించాలన్నారు. మోడీపై వ్యక్తిగతంగా ధ్వజం ఎత్తుతూ ప్రధానిగా తన పదవీకాలంలో ఏది తను చేయలేకపోయారో అది తప్పనిసరిగా చేయడం మంచిదని సలహా ఇచ్చారు.