Friday, November 22, 2024

ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని , చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ అరెస్టును కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ అవినీతికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమం లోనే జూన్ 1 వ తేదీన ఈడీ అధికారులు ఎం3ఎం గ్రూప్, బన్సల్ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీంతో వీరు జూన్ 9 న పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, జులై 5 వరకు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే జూన్ 14న వారిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కస్టడీ లోకి తీసుకుంది.

ఈ అరెస్టును సవాలు చేస్తూ బన్సల్ సోదరులు పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో వారు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపి వీరికి బెయిల్ మంజూరు చేసింది . ఆ ఉత్తర్వుల కాపీ తాజాగా బయటికొచ్చింది. కాగా, విచారణ సమయంలో ఈడీ అధికారుల చర్యలపై సుప్రీం కోర్ట ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

“ ఈడీ ప్రతిచర్య పారదర్శకంగా , ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ ఈ కేసులో దర్యాప్తు సంస్థ తన అధికారాలను , విధులను అనుసరించడంలో విఫలమైనట్టు తేలింది. ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు. అత్యంత పారదర్శకంగా , న్యాయంగా వ్యవహరించాలి. ఈడీ అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్పలేదన్న కారణంతో వారిని అరెస్టు చేయడం సరికాదు.

మనీలాండరింగ్ చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలను సేకరించి అరెస్ట్ చేయాలి. అంతేగానీ, సమన్లకు సరిగా స్పందించలేదని, ఎవరినీ అరెస్టు చేయకూడదు. అంతేగాక, అరెస్ట్ సమయంలో అందుకు గల కారణాలను కూడా నిందితులకు లిఖిత పూర్వకంగా అందించాలి. ” అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో బన్సల్ సోదరుల అరెస్టు చట్ట వ్యతిరేకమన్న ధర్మాసనం … వారిని తక్షణమే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News