ప్రకటనకు ముందే పేర్లు
స్టాక్‌హోం : ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలకూ లీక్‌ల బెడద తలెత్తింది. డిసెంబర్లో బహుకరించే నోబెల్ అవార్డులను ఈ వారంలో వివిధ విభాగాలకు సంబంధించి వరుసగా ప్రకటిస్తున్నారు. ఈ దశలో నోబెల్ కెమిస్ట్రి రంగ పురస్కార విజేతల పేర్లు ముందుగానే స్వీడిష్ మీడియా వార్తాసంస్థలు వెల్లడించాయి. ఇది ప్రపంచవాప్తంగా కలవరానికి దారితీసింది. నోబెల్ విజేతల పేర్ల వెల్లడికి కొద్ది గంటల ముందు విజేతల పేర్లు బయటకు వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డాగెన్స్ నిహెటర్, దేశానికి చెందిన అధికారిక రేడియో, టీవీలలో సంబంధిత వార్తలు ముందుగా రావడంతో , అసాధారణ రీతిలో సమాచారం లీక్ అయిందనే విషయం స్పష్టం అయింది.
నోబెల్ పురస్కారాల రాయల్ స్విడిష్ అకాడమీ నుంచి తమకు సమాచారం అందిందని, దీనిని ప్రాతిపదికగా చేసుకునే విజేతల పేర్లను వెల్లడిస్తున్నామని మీడియా వార్తలలో తెలిపారు. ఈ వార్తలపై నోబెల్ కమిటీ విశ్లేషకులు హీనెర్ లింక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సంస్థ నుంచి అధికారిక ప్రకటనకు ముందు పేర్లు వెలువడితే అది తప్పిదం అవుతుంది. దీనిని కమిటీ తీవ్రంగా తీసుకుంటుందని తెలిపారు. అయినా ఇది ఏ స్థాయిలో లీక్ అయిందనేది ఆరాతీస్తామని వివరించారు. నోబెల్ విజేతల ఎంపిక అత్యంత రహస్యంగా సాగుతుంది. ప్రకటనకు గంట ముందు కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులోనే తమ ముందుకు వచ్చిన నామినేషన్ల పరిశీలన తరువాత విజేతల ఎంపిక జరుగుతుంది. ఆ తరువాతనే మీడియాకు తెలియచేస్తారు.