హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల పంపిణీ ప్రత్యామ్నాయంపై చర్చించామన్నారు. కొత్త ట్రిబ్యునల్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ములుగులో సమ్మక్క, సారక్క ట్రైబల్ కేంద్ర గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇది గిరిజనులకు ఎంతగానో లాభం చేకూరుస్తుందన్నారు. ఈ యూనివర్శిటీ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతుందని, గిరిజనులకు ఉన్నత విద్య అభ్యసించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు యూనివర్శిటీ దోహదపడుతుందన్నారు. దాదాపు రూ.900 కోట్లతో నిర్మిస్తామన్నారు.యూజిసి ద్వారా యూనివర్శిటీ నిర్వహణ కొనసాగుతుందన్నారు. త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఈ యూనివర్శిటీ ద్వారా గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. రైతుల చిరకాల కోరిక మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా పసుపు ప్రాధాన్యత పెరిగిందన్నారు. బోర్డు ద్వారా పసుపు డిమాండ్ పై రీసెర్చ్ చేస్తారని, దాని పెంపును ప్రోత్సహిస్తామన్నారు. పసుపు రైతులకు నైపుణ్యశిక్షణ ఇస్తామన్నారు. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మిగతా పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. పసుపు డిమాండ్ అవసరం మేరకు రైతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. పసుపు బోర్డు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో పసుపు రైతులు కూడా మెంబర్స్ గా ఉంటారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత పసుపు సాగు, ఉత్పత్తి, ఎక్స్ పోర్టు, వినియోగాన్ని పెంచుతామన్నారు.