హైదరాబాద్ : ఎపిలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత మారుతున్న పరిస్ధితుల్లో పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లాలో నాలుగోదశ వారాహి యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా అవనిగడ్డలో తొలి సభ జరిగింది. అనంతరం బందరులో రెండ్రోజులుగా కార్యకర్తలు, పార్టీ నేతలతో పవన్ భేటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం పెడనలో మరో బహిరంగసభకు సిద్దమయ్యారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం పెడనలో జరిగే వారాహి బహిరంగసభలో రాళ్ల దాడి జరగొచ్చని తనకు సమాచారం ఉందంటూ పవన్ కళ్యాణ్ మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి కార్యకర్తలు వారాహి యాత్రలో దాడులు చేసినా ప్రతిదాడులు చేయొద్దంటూ జనసేన క్యాడర్ కు పవన్ సూచించారు. దానికి బదులుగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలన్నారు.
దీంతో పవన్ ఆరోపణలు సంచలనం రేపాయి. దీనిపై వైసిపి వైసీపీ నేతలు ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో కృష్ణాజిల్లా పోలీసులు పెడన సభపై రాళ్లదాడికి సంబంధించి పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. పవన్ కు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. పవన్ సభ దగ్గర అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు తప్పకుండా తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్‌పి జాషువా తెలిపారు. ఎటువంటి సమాచారంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని కృష్ణాజిల్లా ఎస్‌పి తెలిపారు. సమాధానం లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తాము అనుకోవాలా? అని ప్రశ్నించారు.
వ్యాఖ్యలు , ఆరోపణలు సరైన ఆధారం లేకుండా చేయకూడదన్నారు. బాధ్యతారాహిత్యం గా మాట్లాడితే పర్యవసనాలు ఉంటాయన్నారు. తమ సమాచార వ్యవస్థ తమకు ఉందన్నారు. రెచ్చగొట్టే భాషా, సైగలు మానుకొని మాట్లాడాలన్నారు. అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటామన్నారు.