లండన్ : ఓ ఇండో అమెరికన్ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగిపోయి ప్రాణాపాయ స్థితి ఎదురైనప్పటికీ వైద్యబృందం ప్రయత్నాలతో ప్రాణాపాయం తప్పింది. రెండు వారాల చికిత్స తరువాత అతడు పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చాడు. అమెరికాకు చెందిన అతుల్ రావు.. లండన్ లోని ఇంపీరియల్ మెడికల్ కాలేజీలో ప్రీ మెడికల్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. జులై 27న అతడు ఒక్కసారి కుప్ప కూలిపోవడంతో అతడికి సెక్యూరిటీ గార్డు వెంటనే సీపీఆర్ ప్రయత్నం చేశాడు. వెంటనే తోటి విద్యార్థులు అంబులెన్స్ రప్పించారు. అతడి హృదయం కొట్టుకుంటున్నట్టు అంబులెన్స్ లోని పారామెడికల్ సిబ్బంది గుర్తించారు.
సమీపం లోని హృదయాలయానికి తరలించిన తరువాత పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడుతుండటంతో హృదయానికి రక్తం సరఫరాలో ఆటంకం కలుగుతోందని, దానివల్లనే గుండె పోటుకు దారి తీస్తున్నట్టు అనుమానించారు. ఈ పరిస్థితుల్లో 24 గంటల వ్యవధి లోనే ఆ విద్యార్థి హృదయం ఆరుసార్లు ఆగిపోయిందని గుర్తించారు. రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఔషధాలు అందించడం మొదలు పెట్టారు. ఎక్మో అవసరం పడుతుండవచ్చని భావించి సమీపం లోని సెయింట్ థామస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఔషధాల పనితీరు, వైద్యుల కృషితో ఎక్మో అవసరం లేకుండానే అతుల్ కోలుకున్నాడు. రెండు వారాల తరువాత డిశ్చార్జి అయ్యాడు.