Thursday, October 24, 2024

గూగుల్ రజతోత్సవం

- Advertisement -
- Advertisement -

ఏ సమాచారం కావాలన్నా తనని అడిగితే తెలిసిపోతుంది అనే భరోసాను ప్రపంచానికి ఇచ్చిన గూగుల్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక ఆన్ లైన్ సెర్చ్ ఇంజన్ గా మొదలైన దాని ప్రయాణం క్రమంగా వివిధ శాఖలుగా విస్తరించి నేడు ఇంటర్ నెట్ వాడకందారుకి ఒక కొత్త జ్ఞానేంద్రియమై రకరకాల సేవలను అందిస్తోంది. గూగుల్ సృష్టించిన జి మెయిల్ ప్రపంచ ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవస్థను తన మునివేళ్లపై నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గూగుల్ మ్యాప్స్ వేలు పట్టుకొని గమ్యాన్ని చేరుకోవడం ఎంతో సులువైంది. లొకేషన్ షేర్ చేస్తే చాలు అడ్రస్ చేతిలో ఉన్నట్లే. వర్తమాన కంప్యూటర్ ప్రపంచంలో నేడు గూగుల్ దే సింహ భాగం. పాతికేళ్లలో విస్తరించిన ఈ అంతర్జాల సామ్రాజ్యంలో దీని ఆవిష్కర్తలు ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో తొలి పది స్థానా ల్లో చేరిపోయారు. ఇద్దరు విద్యార్థుల మేధస్సులో పుట్టిన ఈ అద్భుత ఆలోచన గూగుల్ నామకరణంతో 1998 సెప్టెంబర్ 27 నాడు వినియోగంలోకి వచ్చింది. అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్న లారెన్స్ లారీ పేజ్, సర్జీ మిఖాయ్ లోవిచ్ బ్రిన్ కలిసి పరిశోధించి గూగుల్‌ను సృష్టించారు.

పేజ్ అమెరికా దేశస్థుడు కాగా, బ్రిన్ రష్యా నుంచి చదువుకోడానికి వచ్చాడు. అప్పటికి ఇద్దరి వయసు పాతికెళ్లే. ఇద్దరూ పిహెచ్‌డి పూర్తి చేసిన పోస్ట్ డాక్టోరల్ విద్యార్థులే. మొదట యూనివర్శిటీలోని వసతి గృహంలోనే తమ పరిశోధనను ఆరంభించారు. తమ ప్రయోగానికి అప్పుడు బ్యాక్ రబ్ అని పేరు పెట్టారు. ఆగస్టు 1998లో వీరు పూర్తి స్థాయి సెర్చ్ ఇంజన్‌ను రూపొందించాక సన్ మైక్రో సిస్టమ్ నుండి లక్ష డాలర్ల చెక్ అందడంతో కాలిఫోర్నియాలో ఒక పాత గ్యారేజీని అద్దెకు తీసుకొని తమ కేంద్రాన్ని అందులోకి మార్చారు. ఆ స్థలం అప్పటికే వారితో పని చేస్తున్న ఉద్యోగినికి చెందినది కాబట్టి దొరకడం సులభమైంది. అందులో రెండు కంప్యూటర్లు, ఒక టేబుల్ టెన్నిస్ బల్ల ఉండేవి. కొన్నేళ్ల పాటు వారిద్దరి నివాసమిక్కడే గడిచింది. అప్పుడే తమ పరిశోధనకు గూగుల్ అని పేరుమార్చారు. గూగుల్ అంటే ఒకటి పక్కన వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్య. హద్దులు లేని తమ సమాచారం వ్యవస్థకు ఆ పేరు సరిగ్గా కుదిరింది.

1995లో మొదలైన యాహూ నష్టాలబారిన పడి యాజమాన్యం చేతులు మారి అస్తిత్వాన్ని కోల్పోవడంతో గూగుల్ అంతర్జాల సమాచార వ్యవ స్థలో విశ్వవిజేతగా మారింది. గూగుల్ 2004 లో జి మెయిల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ మెయిలింగ్ సిస్టమ్ ప్రపంచాన్ని నడిపిస్తోంది. యాహూ, హాట్ మెయిల్ లాంటివి వెనుకబడిపోయాయి. ఉచితంగా లభించే ఈ సేవను చాలా దేశాలు వినియోగించుకుంటున్నాయి. మన దేశంలో 95% మెయిల్స్ దీని ద్వారానే పంపబడతాయి. అదే సంవత్సరం గూగుల్ పబ్లిక్ ఇష్యూ లో ప్రవేశించింది. 2005లో మొబైళ్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆరంభించింది. 2006లో యూట్యూబ్‌ను సొంతం చేసుకొని ఆన్‌లైన్ వీడియో ప్రసారాల్లో పైచేయి సాధించింది. 2007లో డబుల్ క్లిక్‌ను కొనేసి ఆన్ లైన్ వ్యాపార ప్రకటనల్లో ప్రవేశించింది. 2008లో గూగుల్ పేకు శ్రీకారం చుట్టింది. మన దేశంలో 46% ఆన్‌లైన్ చెల్లింపులు దీని ద్వారానే జరుగుతున్నాయి. 2011 గూగుల్ వాయిస్ సెర్చ్ ప్రవేశపెట్టింది. 2016 పిక్సెల్ మొబైల్ ఫోన్ ను విడుదల చేశారు.

2021లో గూగుల్ స్టోర్ ద్వారా ఆన్ లైన్, అవుట్ లెట్‌ల ద్వారా అమ్మకాలు మొదలై కొనసాగుతున్నాయి. ఇలా కాలానికి పోటీపడుతూ గూగుల్ కోట్లాది వినియోగదారులకు చేరువైంది. ప్రస్తుతం సెర్చ్ ఇంజన్ల వినియోగాన్ని గూగుల్ 92% కైవసం చేసుకుంది. రోజుకు 3.5 బిలియన్ల మంది గూగుల్‌ని వాడుతున్నారు. 150 భాషల్లో ఇది సమాచారాన్ని చేరవేస్తోంది. ప్రపంచ సమాచారం వ్యవస్థను తన అరచేతిలోకి తీసుకొన్న గూగుల్ కేంద్ర కార్యాలయం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని గూగుల్ ఫ్లెక్స్ అనే సువిశాల భవంతిలో ఉంది.గూగుల్ డూడుల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గూగుల్ పేజీ తెరవగానే అప్పుడప్పుడు ఆ అక్షరాల్లో రకరకాల బొమ్మలు కనిపిస్తుంటాయి. ఆ రోజు విశేషానికి సంబంధించిన చిత్రాన్ని తమ లోగోలో అమర్చుతుంటారు. ప్రపంచ మేధావుల, శాస్త్రవేత్తల, సామాజిక నేతల బొమ్మలతో వారి సంస్మరణ, నివాళి సమర్పణ వాటిలో చూడవచ్చు. ఇలా గత 25 ఏళ్లుగా 5 వేలకు పైగా డూడుల్స్ ప్రదర్శింపబడ్డాయి. డూడుల్ పై క్లిక్ చేస్తే ఆ చిత్రానికి సంబంధించిన సమాచారం లభిస్తుంది. నిజానికి డూడుల్ ఆరంభం వెనుక ఓ వింతైన సంఘటన ఉంది.

ఓ రోజు ఈ ఇద్దరు మిత్రులు ఊర్లోజరిగే విశేషమైన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నప్పుడు, వారు ఆఫీసుకు దూరంగా ఉన్నామని, సిస్టమ్‌లు క్రాష్ అయితే సహాయం చేయలేమని చెప్పడానికి సంకేతంగా బర్నింగ్ మ్యాన్ చేతులెత్తేసినట్లు తొలిసారిగా గూగుల్ డూడుల్‌ని వాడారు. అలా సందర్భానుసారంగా వాడే డూడుల్ ఇప్పుడు గూగుల్‌లో ఒక అర్థవంతమైన ప్రయోజనంగా మారిపోయింది. చివరకు అది స్కూల్ పిల్లలకు డూడుల్ 4 గూగుల్ అనే పోటీ స్థాయికి చేరింది. 15వ సారి జరిగిన ఈ పోటీకి 2023లో రెబెకా అనే ఆరో తరగతి చదువుతున్న అమెరికా విద్యార్థిని చిత్రం ‘మై స్వీట్ మెమోరీస్’ ఎంపికైంది. ఈ సంవత్సరం ‘ఐ ఆమ్ గ్రేట్ ఫుల్ ఫర్..’ అనే అంశంపై పోటీ పెట్టారు. ఎంపికైన 60 చిత్రాలకు బహుమతులిస్తారు. విజేతల చదువు కోసం 30 వేల డాలర్ల ఉపకార వేతనాలు అందజేస్తారు. దీనికి 14 మార్చి 2024 చివరి తేదీ. ఈ రజతోత్సవ సందర్భంగా గూగుల్ చైర్మన్ సుందర్ పిచ్చాయ్ తమ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో తమ ఉద్యోగులకు శుభాకాంక్షలతో పాటు ఎంత ఎత్తు ఎదిగితే అంత జాగ్రత్త, అప్రమత్తతలు అవసరమని సూచించారు. అందరి ఆదరణతో అతి పెద్ద సంఖ్యకు మారుపేరైన గూగుల్ అదే స్థాయిలో మరిన్ని ఆవిష్కారాలతో వసంతాల బాటలో సాగాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News