Friday, November 22, 2024

స్వామినాథన్ నిజమైన రైతు శాస్త్రవేత్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల కన్ను మూసిన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ నిజమైన రైతు శాస్త్రవేత్త అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ శాస్త్రవేత్త శాస్త్రీయ విజ్ఞానం, ఆచరణలో దాని అమలు మధ్య అంతరాన్ని తగ్గించారని ప్రధాని కొనియాడారు. స్వామినాథన్‌కు నివాళిగా రాసిన వ్యాసంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రముఖ ఆంగ్లదినపత్రికల్లో ఈ వ్యాసం ప్రచురితమైంది.‘ చాలా మంది ఆయనను ‘కృషి వైజ్ఞానిక్’గా అభివర్ణిస్తారు. అయితే ఆయన అంతకంటే ఎక్కువ అని నేను నమ్ముతాను. ఆయన నిజమైన వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన హృదయంలో రైతు ఉన్నాడు’ అని ప్రధాని పేర్కొన్నారు.‘ ఎవరైతే ముందస్తు ప్రణాళిక, దాన్ని అమలు చేయాలన్న దృఢసంకల్పం కలిగి ఉంటారో వారు తాము కోరుకున్న లక్షాన్ని చేరుకుంటారని తమిళ గ్రంథం ‘కురళ్’లో రాసి ఉంది.

తాను వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, రైతులకు సేవలందించాలని చిన్న వయసులోనే నిర్ణయించుకున్న మహానుభావుడు స్వామినాథన్’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆ గ్రంథం రైతులను ప్రపంచాన్నికలిసికట్టుగా ఉంచే కీలకమైన ఆధారంగా అభివర్ణించిందని, ఈ సూత్రాన్ని స్వామినాథన్ బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. స్వామినాథన్ దూరదృష్టిని ప్రధాని ప్రశంసిస్తూ, ప్రపంచంలో అందరూ ఇప్పుడు మిల్లెట్స్‌ను సూపర్ ఫుడ్‌గా పేర్కొంటున్నారని, అయితే స్వామినాథన్ 1900నుంచే మిల్లెట్స్‌పై చర్చను ప్రోత్సహించారని, మానవాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే వారని ప్రధాని అన్నారు. 2001లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామినాథన్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ప్రధాని గుర్తు చేసుకుంటూ, సాయిల్ హెల్త్ కార్డు లాంటి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించడంతో పాటుగా విలువైన సలహాలు ఇచ్చారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News