Monday, November 25, 2024

డ్యూటీలో ఉండాల్సిన వార్డెన్‌ సారు.. మందు పార్టీలో ఉన్నాడు

- Advertisement -
- Advertisement -

డ్యూటీలో ఉండాల్సిన వార్డెన్‌ సారు.. మందు పార్టీలో ఉన్నాడు
విధులకు వచ్చి మందుపార్టీకి వెళ్లిన వైనం
రామవరం ఎస్సీహాస్టల్ వార్డెన్ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
సారు తీరుపై అనేక అరోపణలు
చర్యలు తీసుకోవడంలో అధికారులు మినివేశాలు లెక్కిస్తున్నారు

పాల్వంచ: హాస్టల్ పిల్లలను క్రమశిక్షణగా చూసుకోవాల్సిన అధికారే పెడతోవ పట్టాడు. విధులకు హాజరైన అతగాడు మందు పార్టీలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం పట్టణంలోని రామవరం ఎస్సీ బాలుర వసతిగృహం సంక్షేమ అధికారి రాంనర్సయ్య శుక్రవారం విధులకు వచ్చి సరిగ్గా విద్యార్థులకు భోజనం పెట్టే సమయంలో మందుషాపులో దర్శనమిచ్చాడు. ఎంచక్కా పెగ్గుల మీద పెగ్గులు లాగిస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. ఈ దృశ్యాలు చూసిన కొందరు వ్యక్తులు వీడియో రికార్డు చేసి జిల్లా షెడ్యూల్డ్ క్యాస్ట్ అభివృద్ది అధికారి డి.అనసూర్యకు(డిఎస్సీడిఓ)కు ఫార్వడ్ చేశారు. అయితే, చర్యలు తీసుకోవాల్సిన ఆమె లైట్‌ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా బయట తాగితే ఏమైంది అన్నట్లు సమాధానం ఇచ్చారు.

విద్యార్థులు ఓ వైపు భోజనం చేస్తున్న సమయంలో వార్డెన్ సారు విధులు ముగించుకోకుండానే మందు తాగుతుంటే డీడీ మేడంకు తప్పేం కనబడలేదంట. చర్యలు తీసుకోవాల్సిన అధికారి అండగా నిలుస్తుండడంతో ఆ వార్డెన్ సారు ఆవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం సైతం ఇదే రామవరం ఎస్సీ వసతి గృహం సంక్షేమ అధికారి దాదాపు 24క్వింటాల బియ్యం అమ్ముకున్నాడనే అభియోగాలు ఉన్నాయి. నాడు కూడా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారనే అరోపణలు ఉన్నాయి.

అంతకుముందు అశ్వారావుపేట వసతిగృహ సంక్షేమ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇతగాడిని అధికారిక బదిలీలు లేకున్న కొత్తగూడానికి బదిలీ చేసి రామవరం వసతిగృహం సంక్షేమ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. నాటి నుండి అనేక ఆవినీతి, అక్రమాల అరోపణలు ఎదుర్కొంటున్నప్పటికి ఆ శాఖలోని జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిపోయి అతడికి అండగా నిలుస్తూ వస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనంగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ పాల్వంచ ఎస్సీవసతి గృహాన్ని సందర్శించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీ ఇళ్లు అయితే ఇలానే ఉంచుతారా అంటూ మండిపడ్డారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ హెచ్చరించిన సంక్షేమ శాఖలో ఎటువంటి మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా కేంద్రంలో ఉన్న వసతిగృహా సంక్షేమ అధికారి విధి నిర్వణలో ఉండి విద్యార్థుల భోజన సమయంలో ఎటువంటి బెరుకు లేకుండానే మందు తాగుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులను క్రమశిక్షగా చూసుకోవాల్సిన అధికారి ఇలాంటి పనులు చెయ్యడమేంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తమ పిల్లలను బాధ్యతగా చూసుకోవాల్సిన అధికారి ఇలా ఉంటే తమ పిల్లల భవిష్యత్త్ గాడి తప్పే ప్రమాదముందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News