Monday, November 18, 2024

మాయా నగరం గాజా.. సొరంగాల్లోకి బందీలు!

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: ఇజ్రాయెల్ నుంచి అపహరించిన బందీలను హమాస్ ఉగ్రవాదులు ఇప్పటికే గాజా నగరంలోని భూమి కింద రహస్య ప్రాంతాలకు తరలించి ఉంటారనే అనుమానాలున్నాయి. ఇక్కడ ఉన్న టన్నెల్ నెట్‌వర్క్ అత్యంత ప్రమాదకరమైంది. హమాస్ అధీనంలో ఉన్న బందీలను రక్షించడం ఇప్పుడు ఇజ్రాయెల్ దళాల ముందున్న తక్షణ కర్తవ్యం. అయితే హమాస్ సురక్షిత స్థావరాలు… టన్నెల్ నెట్‌వర్క్‌ను ఛేదించడం ఐడీఎఫ్ దళాలకు సవాలుగా మారనుంది.
ఇజ్రాయెల్‌తో బేరసారాలకు బందీలే కీలకం….
ఇజ్రాయెల్ తమ ప్రజల ప్రాణాలకు చాలా విలువనిస్తుంది. 2006 గిలాద్ షలిట్ అనే యువ సైనికుడిని హమాస్ ముష్కరులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ అన్ని రకాలుగా ప్రయత్నించింది. కానీ చివరికి 2011లో హమాస్‌తో ఖైదీల మార్పిడి ఒప్పందం చేసుకొంది. దీనికింద 1000 పాలస్తీనా ఖైదీలను వదిలి గిలాద్ షలిట్‌ను విడిపించుకొంది. తాజాగా 100 మందికి పైగా హమాస్ చెరలో చిక్కడం… వీరిలో విదేశీయులు కూడా ఉండటంతో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి భారీగా పెరిగిపోయింది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రమయ్యాయి. బందీలు జీవించి ఉంటే .. హమాస్ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిని అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌కు తరలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గాజా సొరంగాల నెట్ వర్క్ గురించి…
ఊరించే ఉచ్చులు… భారీ ఆయుధ నిల్వలు…నిత్యం స్మగ్లింగ్ కార్యకలాపాలు..కిడ్నాప్ చేసిన బందీలను దాచేందుకు… కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా గాజాలోని హమాస్, ఇతర ఉగ్ర సంస్థలు భూగర్భ సొరంగ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశాయి. 2001లో పాలస్తీనా వాసులు ఇజ్రాయెల్ పోస్టులను ధ్వంసం చేయడానికి సొరంగాలను ఉపయోగించేవారు. 2006 లో గాజా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఓ సొరంగం తవ్వి ఆ మార్గంలో ఓ హంతక ముఠా వెళ్లి ఇజ్రాయెల్‌లో ఇద్దరు సైనికులను హత్య చేసి ఒకరిని కిడ్నాప్ చేసింది. అతడిని 2011 ఖైదీల మార్పిడి ఒప్పందం సందర్భంగా విడుదల చేసింది. ఈ ఘటనతో ఐడీఎఫ్ బిత్తరపోయింది. గాజా హమాస్ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి.. ఇక్కడ కాంక్రీట్ వినియోగించి బాలకార్మికులను వాడి అండర్ గ్రౌండ్ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాలతో అనుసంధానించారు. వీటిని యుద్ధ విమానాలు, ఉపగ్రహాలకు దొరక్కుండా కేమోఫ్లాజ్ టెక్నిక్‌తో కప్పి పెడతారు. ఉచ్చులతో నిండిన వీటిల్లోకి కొత్తవాళ్లు అడుగుపెట్టడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. వీటిల్లో నీరు, విద్యుత్తు, ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. ఈజిప్ట్ నుంచి ఆయుధ స్మగ్లింగ్‌కు కూడా వీటిని వాడతారు. గాజా పట్టణంలో దాదాపు 1300 లకు పైగా సొరంగాలు ఉన్నట్టు అంచనా. వీటి ప్రవేశ మార్గాలు, సామాన్య ప్రజలు అధికంగా తిరిగే స్కూల్స్, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులు, పౌర కట్టడాల్లో ఉండేలా చూసుకొన్నారు. ఎందుకంటే ఇక్కడ ఐడీఎఫ్ దాడులు చేయదని వారి నమ్మకం.
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సామగ్రితోనే…
ఈ సొరంగాల నెట్‌వర్క్‌ను వాడిన మెటీరియల్ మొత్తం ఇజ్రాయెల్ నుంచి వచ్చిందే కావడం విశేషం. గాజాలో పౌర నిర్మాణాల కోసం ఇజ్రాయెల్ ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇనుము పంపేది. వాటిని హమాస్ స్వాధీనం చేసుకుని అండర్ గ్రౌండ్ టన్నెల్స్‌కు వాడినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ గుర్తించింది. 2014 నాటికే దాదాపు 4680 ట్రక్కుల మెటీరియల్ హమాస్ పరమైనట్టు గుర్తించింది.
పూర్తిగా ధ్వంసం అసాధ్యం
రెండేళ్ల క్రితం వీటిని లక్షంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసినా, పూర్తిగా ఈ సొరంగాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయలేకపోయింది. ఐడీఎఫ్‌కు సొరంగాలను గుర్తించడం కష్టంగా మారింది. ఒకవేళ సెస్మిక్, రాడార్లను వాడి కనుగొన్నా, లోపల ఉన్న మార్గం ఎక్కడికి వెళుతుందో కచ్చితంగా తెలియదు. కొన్ని సొరంగాలు భూ ఉపరితలానికి 65 అడుగుల కింద ఉండటంతో వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక తాజాగా బందీలను విడిపించడం కోసం ఇజ్రాయెల్ దళాలు ప్రతి ఇంటిని జల్లెడపడుతూ రెస్కూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News