మూడోసారి కూడా బిఆర్‌ఎస్‌దే విజయం
ఎన్నికలకు బిఆర్‌ఎస్ సర్వసన్నద్ధంగా ఉన్నది
యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం
పోటీకి ముందే బిజెపి కాడి ఎత్తేసింది
బిఆర్‌ఎస్ పార్టీ 100 ఎంఎల్‌ఎ స్థానాలు గెలిచి పాత రికార్డులను తిరగరాస్తుంది
ట్విట్టర్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన ఎన్నికలన్నీ ఏకపక్షమే అని.. ఈ ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ భారీ విజయం సాధించబోతోందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండు ఎన్నికల్లో నిండు మనసుతో ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించా….ముచ్చటగా మూడోసారి కూడా ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ మూడో తేదీన ముచ్చటగా, మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దక్షిణ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాయని…దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం కట్టబోతున్నారని అన్నారు. హ్యాక్టరీ విక్టరీ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గుండె గుండెలో గులాబీ జెండా ఎగురుతోందని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప.. ఈ గడ్డపై గాడ్సే రాద్ధాంతం నడవదు అని తేల్చిచెప్పారు. 2014లో ఉద్యమ చైతన్యంతో, 2018లో సంక్షేమ సంబురంతో గెలిచామని కెటిఆర్ వ్యాఖ్యానించారు. 2023లో మూడో ఎన్నికను శాసించేది.. ముమ్మాటికీ మన పదేండ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం అని స్పష్టం చేశారు. ఎన్నికల సమరానికి బిఆర్‌ఎస్ సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం తీసుకుందని, పోటీకి ముందే పూర్తిగా కమలం కాడి పడేసిందని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం.. అఖండ విజయం మనదే అని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పదేళ్ల అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని విజయం సాధిస్తాం
పదేళ్ల కాలంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన మా విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో తమ విజయ మంత్రంగా మారుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో మరొకసారి ఓటమి తప్పదని అన్నారు. ప్రజల మద్దతుతో మరోసారి గులాబీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజలకు మంచి చేసిన బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారని, ప్రజలను ముంచిన కాంగ్రెస్, బిజెపి పార్టీల పైన వేటు వేస్తారని అన్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలో తమ పార్టీ అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ కెప్టెన్,ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్ అని, ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని అడిగారు.
ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారత రాష్ట్ర సమితి శ్రేణులు సమరోత్సహంతో కదం తొక్కుతున్నాయని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న బలమైన కోరిక కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నిబద్ధతతో చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తించి 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిపించారని, ఆ తర్వాత సబ్బండ వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వలన 2018లో మరోసారి ప్రజలు భారత రాష్ట్ర సమితిని దీవించారని తెలిపారు. ఈసారి జరిగిన పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలు గుర్తించి మరోసారి పట్టం కడతారని కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉన్నదని, యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందని,పోటీకి ముందే బిజెపి కాడి ఎత్తేసిందని అన్నారు. తెలంగాణ చరిత్ర బిఆర్‌ఎస్‌తోనే అని, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కూడా కెసిఆర్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈసారి 100 ఎంఎల్‌ఎ స్థానాలు గెలిచి పాత రికార్డులను బిఆర్‌ఎస్ పార్టీ తిరగరాస్తుందని, పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుందని కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..!
భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..!రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!
మూడోసారి మనదే జయం..!డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో
ముచ్చటగా మూడోసారి గెలిచేది
మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారే..!దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం
దక్షత గల…— KTR (@KTRBRS) October 9, 2023