Sunday, December 22, 2024

మోగిన ఎన్నికల నగరా….

- Advertisement -
- Advertisement -

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నోటిఫికేషన్
నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి
తెలంగాణలో నవంబర్ 30, రాజస్థాన్‌లో నవంబర్ 23
మధ్యప్రదేశ్ నవంబర్ 07, మిజోరం నవంబర్ 07
చత్తీస్‌ఘడ్‌లో రెండు విడుతలో నవంబర్ 7, 17 తేదీలు
డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల
మధ్యాహ్నం నుంచే తనిఖీలు ప్రారంభించిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్:  కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీష్‌గడ్, రాజస్ధాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం చీప్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణకు ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని, నామినేషన్లకు చివరితేదీ నవంబర్ 10వ తేదీ, పరిశీలన 13వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15వ తేదీగా పేర్కొన్నారు.

ఇక రాజస్థాన్‌కు నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీస్‌ఘఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో 3. 17 కోట్లు, రాజస్థాన్‌లో 5. 25 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5. 6 కోట్లు, చత్తీస్‌ఘడ్‌లో 2.03 కోట్లు, మిజోరంలో 8. 52లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సహా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకత, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం అదనంగా 1.01 లక్షల బూత్‌లకు వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా..
రాష్ట్రంలో మొత్తం 3.17కోట్ల ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 1.58 కోట్లు, మహిళా ఓటర్లు 1.58 కోట్లు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు 8.11 లక్షలు (18- నుంచి19ఏళ్ల వయసు). దివ్యాంగులు 5.06 లక్షలు. 80ఏళ్ల వయసు పైబడిన వారు 4.4లక్షలు (వీరికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది). వందేళ్ల వయసు దాటిన ఓటర్లు 7005 మంది ఉన్నారు. ఈ సారి కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 17,01,087 గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో వెబ్క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27798 (78శాతం). 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మొత్తం 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి
కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో ఈ క్రింది నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాల్సి ఉంటుంది.

1. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.
2. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.
3. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
4. సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.
5. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
6. ప్రభుత్వ వసతి గృహాలు, సభా ప్రాంగణాలు, హెలిప్యాడ్‌లు తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.
7. పత్రికల్లో, టివిల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
8. టివిల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సిడిని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.
9. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు.
శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

తనిఖీలు ప్రారంభించిన పోలీసులు: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు తనిఖీలకు తెరలేపారు. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసుల తనిఖీలో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజేశ్వరి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఆ నగదు తరలిస్తుండగా, ఆ నగదుకు ఎలాంటి అనుమతి పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. ఏలూరు నుంచి వ్యవసాయ భూమికి చెందిన డబ్బులు హైదరాబాద్ తీసుకెళుతున్నానంటూ రాజేశ్వరి పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ… పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన ఓ కారులో రూ.5 లక్షలు లభ్యమయ్యాయని తెలిపారు. ఆ మహిళ సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న రూ.5 లక్షలను ఐటీ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే అనుమతులు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News