సిపిఐ, సిపిఎం పార్టీలకు చెరో రెండు సీట్లు
సిపిఎంకు భద్రాలచం, మిర్యాలగూడ
సిపిఐకి మునుగోడు, కొత్తగూడెం సీట్లు
అధిష్టానం గ్రీన్‌సిగ్నల్
పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు,
ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పోటీ?
త్వరలోనే ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వాపమక్షాలతో పొత్తు ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఈ పొత్తుల్లో భాగంగా సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సమాచారం. సిపిఎం పార్టీకి భద్రాలచం, మిర్యాలగూడ సీట్లు, సిపిఐకి మునుగోడు, కొత్తగూడెం సీట్లను ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటగా రెండు పార్టీలకు చెరో సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి ముందు ఉంచగా కమ్యూనిస్టులు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా తెలిసింది. దీంతో చెరో రెండు స్థానాల్లో టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సిపిఎంకు ఆ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపా లని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పాలేరు, ఖమ్మం నుంచి టికెట్లు కావాలని కమ్యూనిస్టులు పట్టుబట్టారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ప్రచారాన్ని సైతం వారు ముమ్మరంగా చేస్తున్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలువనున్నారు. దీంతో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పోటీచేసే స్థానాలను సైతం కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి పొంగులేటి బరిలో ఉంటారని తెలిసింది.