Saturday, November 23, 2024

బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాం

- Advertisement -
- Advertisement -

వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాల్లో ప్రజలు ప్రయాణించొద్దు
ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 5,265 ప్రత్యేక బస్సులు
టిఎస్‌ఆర్టీసి ఆర్టీసి ఎండి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్:  బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడానికి టిఎస్ ఆర్టీసి సిద్ధంగా ఉందని, పోలీస్, రవాణా శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశం చేసుకుంటున్నామని టిఎస్‌ఆర్టీసి ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో సోమవారం ఆర్టీసి ఎండి సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎండి సజ్జనార్ మాట్లాడుతూ వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాల్లో ప్రజలు ప్రయాణించొద్దని ఆయన సూచించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అధిక రద్దీ ఉండే అవకాశమున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఎండి వెల్లడించారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. టిఎస్ ఆర్టీసిలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారన్నారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఆర్టీసికి తమవంతు సహకారం ఉంటుంది: సిటీ ట్రాఫిక్ అదనపు కమిషనర్
హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) జి.సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టిఎస్ ఆర్టీసికి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చడానికి టిఎస్ ఆర్టీసితో సమన్వయంగా పని చేస్తామన్నారు. ఈ సమన్వయ సమావేశంలో హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, శ్రీనివాస్, రాచకొండ, ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డిసిపిలు రణవీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రవాణా శాఖ చెందిన ఆర్టీఏలు రఘునందన్ గౌడ్ (ఇబ్రహీంపట్నం), రామచందర్ (హైదరాబాద్ సెంట్రల్), శ్రీనివాస్ రెడ్డి (హైదరాబాద్ నార్త్)తో పాటు టిఎస్ ఆర్టీసి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News