Friday, November 22, 2024

ఆసియాడ్‌లో పతకాల పతాక

- Advertisement -
- Advertisement -

చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107 పతకాలతో తిరిగి వచ్చినందుకు యావత్ దేశం వారిని అభినందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను తెచ్చి దేశ కీర్తి పతాకను సమున్నతంగా ఎగుర వేయాలని ఆశిస్తోంది. నాలుగేండ్లకు ఒకసారి జరుగుతున్న ఆసియా క్రీడలు చైనాలో కరోనా నిరోధ చర్యల కారణంగా 2022లో జరగాల్సినవి ఈ ఏడాది నిర్వహించారు. 2026లో జపాన్‌లోని ఇచి, నాగోయా నగరాల్లో జరగనున్నాయి. మన క్రీడాకారులు 28 బంగారు, 38 రజిత, 41 కాంస్య పతకాలను సాధించారు. వీటిలో కొన్ని అనూహ్య పతకాలు ఉన్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా తరువాత నాలుగవ స్థానంలో మన దేశం ఉంది.

జనాభాతో, ఆర్థికంగా చైనాతో పోటీపడుతున్న మనం క్రీడల్లో ఎందుకు పోటీలో లేము అని ఎవరైనా అనుకోవచ్చు. దానికి ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, వాటి నేతలు తప్ప క్రీడాకారులు కాదు. అధికారం నిలుపుకోవటం మీద ఉన్న యావ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్న దాని మీద ఏమాత్రం లేదు.
పోటీలకు ముందు రెజ్లర్స్ ఫెడరేషన్ బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్ (బిజెపి ఎంపి) నిర్వాకం, క్రీడాకారుల ఆందోళన గురించి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన ఎంపిని కాపాడుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పోటీల్లో పాల్గొనేవారి పట్ల చూపలేదు. అందుకే చివరికి ఫెడరేషన్ లేదు, జాతీయ శిక్షణా శిబిరాలు లేవు, అంతర్జాతీయ శిక్షకులు లేరు, అయినప్పటికీ తాజా క్రీడల్లో వారు ఒక వెండి, నాలుగు కాంస్య పతకాలను సాధించారు. మరికొన్ని క్రీడలకు సంబంధించిన వివాదాల కారణంగా చివరి వరకు ఎంపికలు జరగలేదంటే మన యాజమాన్య నిర్వహణ ఎంత అసమర్ధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఉదాహరణకు ఈక్వెస్ట్రియన్ పోటీలో పాల్గొనాలంటే క్రీడాకారులతో పాటు గుర్రాలను కూడా తీసుకు పోవాల్సి ఉంటుంది. క్వారంటైన్ నిబంధనల కారణంగా భారత గుర్రాలను చైనా అనుమతించటం లేదనే కీలక అంశాన్ని తన దగ్గర దాచారని క్రీడాకారుడు గౌరవ్ పుందిర్ చెప్పాడు. తీరా తెలుసుకున్న తరువాత ఐరోపా, మరో చోట తగిన గుర్రాల కోసం వెళ్లేందుకు, శిక్షణ పొందేందుకు తనకు అవకాశం లేకుండా పోయిందని, ఎంపిక విధానాన్ని కూడా మార్చారని వాపోయాడు. పోటీలకు వెళ్లకుండా తనను అడ్డుకోవడమే ఫెడరేషన్ అధికారుల ఎత్తుగడగా కనిపించిందని ఆరోపించాడు. పతకాలు వచ్చిన వారికి బహుమతులు ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం కాదు కావాల్సింది ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ సౌకర్యాలు, క్రీడలనే ఆలంబనగా చేసుకున్న వారు జీవితంలో స్థిరపడేందుకు ఇచ్చే చేయూతను బట్టే యువతరం ముందుకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన పతకాల కీర్తి కూడా క్రీడాకారుల తపనకు, వారిని ప్రోత్సహించిన తలిదండ్రులకు తప్ప మరొకరికి దక్కదు. ఈ క్రీడల్లో కొన్ని అనూహ్య పతకాలను మన దేశానికి సాధించటం సంచలనం కలిగించింది.

1951లో మన దేశమే తొలి ఆసియాడ్‌కు ఆతిథ్యమిచ్చింది. నాడు 17 దేశాల వారు 489 మంది పాల్గొంటే ఇప్పుడు 41కి, పోటీలు 57 నుంచి 481 అంశాలకు పెరిగాయి. చైనా 1962 నుంచి మాత్రమే పాల్గొంటున్నది. ఇప్పటి వరకు వివిధ దేశాలు సాధించిన బంగారు పతకాల సంఖ్య ఇలా ఉంది. బ్రాకెట్లలో ఉన్నవి మొత్తం పతకాల సంఖ్య చైనా 1,674 (3,570), జపాన్ 1,084 (3,240), దక్షిణ కొరియా 787 (2,425), ఇరాన్ 193 (611), భారత్ 183 (779). తొలి ఆసియన్ గేవ్‌‌సు జరిగిన తీరు చూస్తే అసలు నిర్వాహకులు ఎంత ఇబ్బందిపడింది, అధికారంలో ఉన్నవారికి క్రీడల పట్ల శ్రద్ధలేమి స్పష్టంగా కనిపించింది. నాటి నుంచి నేటి వరకు ఉత్సాహవంతులైన వారి చొరవే ప్రధానంగా కనిపించింది. తొలి క్రీడల్లో జపాన్ 24 బంగారు పతకాలతో మొత్తం 58 పొందగా, రెండవ స్థానంలో మన దేశం 15 స్వర్ణాలతో 51 పతకాలు సాధించింది. తరువాత 1962లో జపాన్ 73 స్వర్ణాలతో ముందుండగా పదింటితో రెండవ స్థానంలో మన దేశం ఉండటం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం రెండవ స్థానానికి ఎదగలేదు.

టెహరాన్ 1974 క్రీడలలో చైనా 32 స్వర్ణాలతో రెండవ స్థానంలోకి వచ్చింది. తరువాత 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో తొలిసారిగా 61 పతకాలతో జపాన్ను వెనక్కు నెట్టి మొదటి స్థానానికి వచ్చిన చైనా అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూడలేదు. 1990లో తొలిసారిగా చైనాలో ఆసియా క్రీడలు జరిగాయి. 183 బంగారు, మొత్తం 341 పతకాలతో చైనా క్రీడాకారులు అదరగొట్టారు. తాజా పోటీలలో 200 స్వర్ణ, 111 రజత, 71 కాంస్యాలతో మొత్తం 382 పతకాలను సాధించింది.
1896 నుంచి 2020 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో మన దేశం నిరాశాజనక ప్రతిభనే కనపరిచింది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుందాం. 2020లో జరగాల్సిన టోకియో ఒలింపిక్స్ మరుసటి ఏడాది జరిగాయి. వాటిలో 39 స్వర్ణాలు, మొత్తం 113 పతకాలతో అమెరికా, 38 స్వర్ణాలు, మొత్తం 89తో చైనా, 26 స్వర్ణాలు, మొత్తం 57 పతకాలతో జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మన దేశం ఒక స్వర్ణం, మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 32 పోటీల్లో ఐదు స్థానాలో అధిక పతకాలు తెచ్చుకున్న తొలి దేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

సోవియట్ యూనియన్‌కు వెయ్యికిపైగా పతకాలు వచ్చినప్పటికీ అది ఉనికిలో లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆలస్యంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిందన్న అంశాన్ని గమనలో ఉంచుకోవాలి. 1984 లాస్ ఏంజల్స్ పోటీల నుంచి పాల్గొంటున్నది. క్రీడలకు రాజకీయాలు ఉండవు. రాజకీయ కారణాలతో కొన్ని దేశాలు కొన్ని పోటీలను బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. చైనాతో జనాభాను అధిగమించిన మనం క్రీడల్లో ఎందుకు దూసుకుపోలేకపోతున్నాం అన్నది ప్రశ్న. మన దేశంలో పిల్లలతో ఆటలాడించేందుకు స్థలాల్లేకుండానే పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. ఎన్ని స్కూళ్లలో క్రీడోపాధ్యాయులు ఉన్నారు. ఎన్ని చోట్ల ఆటలాడిస్తున్నారు, అవసరమైన కనీస పరికరాలు ఎన్ని చోట్ల ఉన్నాయి అన్నది రోజు మనం చూస్తున్నదే. కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే విధంగా ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్నారు. క్రీడల మీద మనం చేస్తున్న ఖర్చు ఎంత? మాజీ అధ్లెట్, 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ

2017 18లో కేంద్ర క్రీడల బడ్జెట్ రూ. 1,329 కోట్లని, 2011 జనాభా లెక్కల ప్రకారం రోజుకు తలకు ఒక్కరి మీద మూడు పైసలు క్రీడలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆ వార్తను ప్రచురించిన స్పోర్ట్స్ క్రీడా డాట్ కావ్‌ు చైనా డైలీలో వచ్చిన సమాచారం ప్రకారం చైనా ప్రభుత్వం ఏటా 316.5 బిలియన్ యువాన్లు ఖర్చు చేస్తున్నదని దాన్ని రూపాయల్లో మారిస్తే మూడు లక్షల కోట్లని (2018 జనవరి 9) పేర్కొన్నది.
ఈ ఏడాది మార్చి 28వ తేదీన టైవ్‌‌సు ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ప్రకారం 2007 08లో మన కేంద్ర బడ్జెట్‌లో రూ. 708 కోట్లు కేటాయించారని, తరువాత కామన్‌వెల్త్ క్రీడలు ఉన్నందున 2009 10లో రూ. 3,760, మరుసటి ఏడాది రూ. 2,841కోట్లుగా ఉందని, 201516లో రూ. 1,121 కోట్లకు తగ్గింది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రకటించిన తరువాత 2019 20లో రూ. 2,636 కోట్లు కేటాయించారు. కరోనాలో రూ. 1,800 కోట్లకు తగ్గించారు.

2023 24 బడ్జెట్‌లో రూ. 3.397 కోట్లు కేటాయించగా దానిలో ఖేలో ఇండియాకు వెయ్యి కోట్లు పక్కన పెట్టారు. ఈ మొత్తం 140 కోట్ల జనాభాకు తలకు ఏటా రూ. 24 అవుతుంది. బ్రిటన్‌లో 2022 23లో తలకు రూ. 4,898, ఆస్ట్రేలియాలో రూ. 976 ఖర్చు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న మొత్తాలు రూపాయలలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఎంత పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో వాటా 0.6 నుంచి 0.8 శాతం మధ్యనే ఉంటోంది. మన దేశంలో ఇంత తక్కువ ఖర్చు పెడితే క్రీడాకారులు ఎలా తయారవుతారు, పతకాలు ఎలా వస్తాయి? పోనీ ప్రతిభ గలవారికి కొరత ఉందా?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News