భోపాల్: బిజెపి ప్రయోగశాల అని ఘనంగా చెప్పుకుంటున్న మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై బిజెపి నాయకులు మూత్ర విసర్జన చేస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రయోగశాల గుజరాత్ కాదని, అసలు ప్రయోగశాల మధ్యప్రదేశ్ అంటూ బిజెపి వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ తాను రాసిన పుస్తకంలో అభివర్ణించారని రాహుల్ గుర్తు చేశారు.
ఈ ప్రయోగశాలలో చనిపోయిన వ్యక్తులకు చికిత్స జరుగుతుందని, వారి డబ్బు చోరీ అవుతుందని రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యాపమ్ కుంభకోణం కోటి మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం కారణంగా 40 మంది హతమయ్యారని, ఎంబిబిఎస్ సీట్లు అమ్ముడుపోయాయని, రిజిస్ట్రార్ కావాలంటే రూ. 15 లక్షలు చెల్లిస్తే చాలని ఆయన మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వారి అరాచకాలు ఇక్కడితో ఆగబోవని, బిజెపి ప్రయోగశాలలో గత 18 ఏళ్లలో 18,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఒక నాయకుడి భవిష్యత్తుతో ఒక పార్టీ భవిష్యత్తునో నిర్ణయించబోవని చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తానని ఆయన అన్నారు.
ద్రవ్యోల్బణం సమయంలో తాము ప్రజలకు ఉపశమనం కలిగించే అనేక సహాయక చర్యలు చేపట్టామని రాహుల్ తెలిపారు. ప్రతి ఇంట్లో డబ్బును పొదుపు చేసుకునేలా చూడడమే తమ కర్తవ్యమని, ఈ విషయంలో తాము విజయవంతం అయ్యామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.