హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నేతల మధ్య హీట్ పెరిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకు కాంగ్రెస్, బిజెపిలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పంచాయతీ నడుస్తోంది. వాడీ వేడిగా రచ్చ జరుగుతోంది. దీంతో పలు కుల సంఘాలకు చెందిన నేతలు తమకు టికెట్ ఇవ్వాలంటూ గాంధీ భవన్ ముందు ఆందోళన చేస్తున్నారు.
దీంతో తెలంగాణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు, నేతల మధ్య సయోధ్యలో కీలక పాత్ర పోషించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మాజీ మంత్రి జానా రెడ్డిని నియమించింది. ఆయనకు ట్రబుల్ షూటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించి నలుగురు సభ్యులతో కూడిన కమిటీకి నాయకత్వం వహించారు. కమిటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే, దీపా దాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తలెత్తిన అసంతృప్తిని పరిష్కరించడం ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యం. బుధవారం గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో అసంతృప్త నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.