- మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
మంచిర్యాల ప్రతినిధి: మూడోసారి ముచ్చటగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రానుందని, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే మూడు గంటల కరెంటు తోటి సీక్రెట్ బతుకుల్లో నెట్టివేస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడిన మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందన్నారు.
అలాగే మూడోసారి ముఖ్యమంత్రిగా మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా తమను డిక్లేర్ చేసిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఇక మంచిర్యాలలో అభివృద్ధి హైదరాబాద్ తరహాలో దూసుకుపోతుందన్నారు. మంచిర్యాలలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను కూడా ఈ మధ్య ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. మంచిర్యాలను అన్ని విధాల అభివృద్ధ్ది చేయడం జరుగుతుందని కావున ప్రజలు తమను తప్పకుండా ఆశీర్వదిస్తారని అన్నారు. అన్ని బ్యాంకుల్లో కూడా దాదాపు 800 కోట్ల అప్పు ఉన్న ప్రేంసాగర్‌రావును ప్రజలు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు.
60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల్లో ఎన్నడు ఊహించని విధంగా అభివృద్ధ్ది చేసిందన్నారు. ఇక కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని, కరెంటు ఇచ్చేటటువంటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కళాశాల కేవలం రాష్ట్ర నిధులతో నిర్మించినవే కాని బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుండి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, హాజీపూర్‌లో రైతుల చిరకాల కోరిక అయిన 8 వేల ఎకరాలకు లిఫ్టు ఇరిగేషన్ ద్వారా సాగు నీరు అందించడం జరుగుతుందని, బీజేపీ, కాంగ్రెస్‌లు పార్టీకి ఓట్లు వేస్తే సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తారన్నారు.
ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజల మద్దతుతో మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుందర, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.