న్యూఢిల్లీ : ఆప్‌ను అంతం చేస్తారనే ప్రచారం సాగుతోందని, పార్టీ నేతలపై బూటకపు కేసులు బనాయిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఆప్ ఎమ్‌ఎల్‌ఎ అమన్‌తుల్లాఖాన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా మంగళవారం దాడి చేసిన తరువాత అమన్‌తుల్లాఖాన్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ విలేఖరులతో మాట్లాడుతూ తమ ఆప్ నేతలపై 170 కేసులు దాఖలు కాగా,
వాటిలో 140 కేసుల్లో తీర్పులు తమకు అనుకూలంగా వచ్చాయన్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ సీనియర్ నేతలను, మంత్రులను అరెస్టు చేయడం ప్రారంభించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్‌ను అంతం చేయడంలో భాగంగా దాడులు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోందని ఆరోపించారు. అవినీతి పరులని మోడీ పేర్కొనేవారు ఇప్పుడు బీజేపీలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు.