హైదరాబాద్: ప్రగతి భవన్ లో మంత్రులు కెటిఆర్, హరీశ్ రావుతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల ప్రచారం చర్చించనున్నారు. ఈ నెల 15న మ్యానిఫెస్టోను భారత రాష్ట్ర సమితి వెల్లడించనుంది. ఇవాళ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ కూడా ఉంది. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కెసిఆర్ వారితో సమాలోచనలు జరపనున్నారు.
ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రంలో నేతలు హడావిడి పెరిగింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అభివృద్ధికి ఓటేయ్యలంటూ బిఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి.