పాలేరు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న నియోజకవర్గంగా పేరుగాంచింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఈ సీటు కోసం ప్రస్తుతం హేమాహేమీలు, దిగ్గజాలు పోటీపడుతున్నారు. తుమ్మల, పొంగులేటి, షర్మిలంతా పాలేరు వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఈ నాలుగు మండలాలతో కలిపి ఉండే పాలేరు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సాధారణ ఎన్నికలు కాగా, ఒక ఉప ఎన్నిక జరిగింది.
రెండు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలిచింది. ఉప ఎన్నికలో మాత్రం బిఆర్‌ఎస్ గెలిచింది. రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉండే ఈ నియోజకవర్గంలో బిసి, లంబాడీల జనాభా కూడా ఎక్కువే. పాత వరంగల్, పాత నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉండే పాలేరు నియోజకవర్గంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి రెడ్డిలే గెలిచారు. అంతేకాదు, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం మూడంటే మూడే అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మిగతా అన్నీ రిజర్వ్‌డ్ స్థానాలే కావడంతో, ఈ మూడు జనరల్ సీట్ల కోసం పోటీ పెరిగింది. అందులో ఈ పాలేరు ఒకటి కావడం విశేషం.