హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ మొదటి సారి ప్రతి ఇంటికి మిషన్ భగీరథలో భాగంగా వాటర్ కనెక్షన్ ఇచ్చిందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఎక్స్ (ట్విట్టర్)లో ద ఇండియన్ ఇండెక్స్ చేసిన ట్వీట్‌పై మంత్రి కెటిఆర్ స్పందించారు. దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ట్వీట్ చేసిన ఇండియా ఇండెక్స్ తొలి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు వెల్లడించింది. విజన్ ఉన్న కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ సక్సెస్ చూసి కేంద్రం ‘హర్ ఘర్ జల్’ అనే కార్యక్రమాన్ని తెచ్చిందని తెలిపారు. తెలంగాణ ఏది చేస్తే దేశం అది అనుసరిస్తుందని ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. అంతకు ముందు ద ఇండియన్ ఇండెక్స్ తన ట్విట్టర్‌లో దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను అందులో పేర్కొంది.
ఆ జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా గుజరాత్, గోవా రెండు,మూడు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఇంటికి మంచి నీటి పథకం హర్ ఘర్ జల్‌లో భాగంగా ఈ లెక్కలను ద ఇండియన్ ఇండెక్‌స ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నాణ్యమైన తాగు నీటి సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు. ఈ పథకాన్ని 2016 ఆగస్టు 6వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామంలో ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ కలిసి ప్రారంభించారు. ఇలా నల్లాల ద్వారా తాగునీరు ఇవ్వడం వల్ల ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు అనేవి లేకుండా పోయాయి. ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా అత్యధికంగా లబ్దిపొందుతున్న జిల్లాల్లో ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ ఉన్నాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ 2021 ఇండెక్స్ తెలిపింది. రాష్ట్రంలోని వంద శాతం గ్రామీణ నివాస ప్రాంతాలకు 2021 నాటికి పైపుల ద్వారా నీటి సరఫరాను కావించారు.