Monday, January 20, 2025

గాజాలో గ్రౌండ్ ఆపరేషన్!

- Advertisement -
- Advertisement -

గాజా: హమాస్ సృష్టించిన మారణ కాండకు ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతోంది. ఇప్పటివరకు కేవలం వైమానిక దాడులు జరిపిన ఇజ్రాయెల్ దళాలు ప్పుడు గాజాలో అడుగుపెట్టడానికి(గ్రౌండ్ ఆపరేషన్)సిద్ధమవుతున్నాయి.అయితే దీనికి రాజకీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు తమ దళాలు గాజాలో క్షేత్రస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని,దీనిపై నేతలనుంచి నిర్ణయం వెలువడిన వెంటనే రంగంలోకి దిగుతాయని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. హమాస్ గ్రూపు ఉనికి భూమిపై లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం 3,60,000 మంది రిజర్వ్ ఆర్మీని రంగంలోకి దించింది. అయితే హమాస్ మిలిటెంట్ల చేతిలో ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్న నేపథ్యంలో గ్రౌండ్ ఆపరేషన్ విషయంలో ఇజ్రాయెల్ సైన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది.

గాజాలో జనసాంద్రత అధికం. ఇక్కడ చదరపు కిలోమీటర్‌కు 5,500 జనాభా ఉంది. అంతేకాకుండా బహుళ అంతస్తుల భవనాలు కూడా ఎక్కువ. దీంతో ఇజ్రాయెల్ సైన్యానికి ఇక్కడి వీధుల్లో హమాస్ మిలిటెంట్ల వేట కత్తిమీద సాము వంటిది. కానీ అర్బన్ వార్‌ఫేర్ విషయంలో ఇజ్రాయెల్‌కు మంచి అనుభవం ఉంది.ఇందుకోసం వేల సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు గాజా నగరంలోకి ప్రవేశించి ఇల్లిల్లు గాలించి మిలిటెంట్లను ఏరివేస్తాయని అంచనా.అయితే ఈ పనంతా ఒకేసారి జరగాల్సి ఉంటుంది. అంతేకాదు గాజా ప్రాంతంలో బాంబుదాడుల కారణంగా పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టం అయిన కారణంగా ఈ శిధిలాలను దాటుకుని వెళ్లడం ఇజ్రాయెల్‌కు అంత సులభం కాదు. పైగా గాజా ప్రాంతంలో భూగర్భ సొరంగాలు, కందకాలు కూడా ఎక్కువే.ఈ సొరంగాల నెట్‌వర్క్‌లో నక్కిన మిలిటెంట్లను బైటికి తీసుకువచ్చి మట్టుపెట్టడం ఇజ్రాయెల ముందున్న అతిపెద్ద సవాలు.

పైగా మిలిటెంట్లు ఏ వైపునుంచి దాడి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. వీటన్నిటికి మించి హమాస్ వద్ద ఇజ్రాయెల్‌తో పాటుగా ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా బందీలుగా ఉండడంతో వారి ప్రాణాలకు హాని కలగకుండా మిలిటెంట్లను మట్టుబెట్టాల్సి రావడం ఇజ్రాయెల్ దళాలకు ఆపరేషన్‌ను సంక్లిష్టంగామార్చేశాయి.అనుకున్న సమయానికన్నా ఈ ఆపరేషన్‌మరింత ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. గాజాలోని మిలిటెంట్లకు ఆయుధాలు అందకుండా ఇజ్రాయెల్ భూ, జలమార్గాలను మూసివేసింది.ఇప్పటికే గాజాకు కరెంటు, నీరు, విద్యుత్, ఆహార సరఫరాలను కూడా నిలిపివేసింది. దీంతో ఏ క్షణమైనా దాడులు తీవ్రం కావచ్చన్న భయంతో గాజాలో ఉంటున్న వారు పెట్టే బేడాతో తలదాచుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే గాజా ప్రాంతంలోని ఐరాస నడుపుతున్న పాఠశాల భవనాల వద్దకు వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అక్కడక్కడ దుకాణదారులు ధైర్యం చేసి షాపులు తెరుస్తున్నప్పటికీ ప్రజలు నిత్యావసరాలైన బ్రెడ్‌లాంటివి కొననడానికి భారీ సంఖ్యలో ఆ షాపుల ముందు క్యూ కడుతున్నారు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దాడుల్లో గాయపడిన వారికి వైద్యం కూడా అందని పరిస్థితి.

ఇప్పటివరకు ఈ దాడుల్లో ఇరు వైపులా 2,500 మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు. మానవతా దృష్టితో ఆహారం, మంచినీరులాంటి వాటి సరఫరాకు అనుమతించాలని రెడ్‌క్రాస్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ ప్రభుత్వం తిరస్కరించింది. హమాస్ తమవద్ద ఉన్న బందీలను సురక్షితంగా విడిచిపెట్టేంతవరకు గాజాకు ఇంధనం, నీరు, విద్యుత్‌సరఫరాలను పునరుద్ధరించబోమని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. ‘వారు క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు నీరు, విద్యుత్, ఇంధన సరఫరాల పునరుద్ధరణ జరుగుతుంది. అప్పటివరకు ఎలాంటి సాయం అందదు’ అని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం మేము దయ్యాల నగరంలో ఉన్నాం. బాంబుల శబ్దాలకు ఇళ్లు కంపిస్తున్నాయి. మమ్మల్ని రక్షించమని చేతులు జోడించి ఆ దేవుడ్ని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి’ అని గాజాలోని ఓ పౌరుడు వాపోయాడు.

సిరియా ఏర్‌పోర్టులపై ఇజ్రాయెల్ బాంబుదాడులు
మరో వైపు హమాస్‌కు మద్దతుగా పోరులోకి దిగిన సిరియాపై ఇజ్రాయెల ప్రతిదాడులు జరుపుతోంది. సిరియా రాజధాని డమాస్కస్, అలెప్పో నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ గురువారం ఏకకాలంలోజరిపిన వైమానిక దాడుల్లో ఆ రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. దీంతో ఈ రెండు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఈ దాడులతో సిరియా ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్‌లను యాక్టివేట్ చేసినట్లు కూడా ఆ వార్తలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడులు జరిగిన సమయంలో ఒక విమానం డమాస్కస్‌లో దిగాల్సి ఉండిందని, అయితే దాన్ని వేరే ప్రాంతానికి మళ్లించినట్లు వార్తలు తెలిపాయి. ఆ విమానంలో ఇరాన్‌కు చెందిన పలువురు దౌత్యవేత్తలు ఉన్నట్లుగా కూడా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News