Friday, January 3, 2025

అభ్యర్థులకు వ్యయ పరిమితి రూ.40 లక్షలే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు, కార్యకర్తలకు కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీల కోసం చేసే వ్యయాన్ని అభ్యర్థులు గతంలో తక్కువగా చూపించేవారు. అందుకు ఆస్కారం లేకుండా ఈసారి ఎన్నికల అధికారులు ధరలు జాబితాను రూపొందించారు. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా జాబితా విడుదల చేసింది.. 40 లక్షలు ఫిక్స్ చేసిన ఎన్నికల కమిషన్ ప్రచారంలో పాల్గొనే కార్యకర్తల కాఫీ. టీ, టిఫిన్, బిర్యానీ… తదితర వాటికి దేనికెంత అనే వివరాలతో పట్టిక రూపొందించింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖరుల లెక్కలు చూపించాలని ఆదేశించింది. ఖర్చు రూ. 40 లక్షలకు మించకూడదని తెలిపింది.

నీళ్ల ప్యాకెట్ నుంచి మొదలుకుని, సభలు, సమావేశాల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు. ఎల్‌ఈడి తెరలకు సైతం ధరలను నిర్ణయించారు. ఒక్కో బెలూన్‌కు రూ.4 వేలు, ఎల్ ఈడీ తెరకు రూ.15 వేలను రోజు అద్దెగా పరిగణిస్తారు. ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహిస్తే పట్టణ ప్రాంతాల్లోనైతే రోజుకు రూ.15 వేలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి. ఎన్నికల సంఘానికి అభ్యర్థి సమర్పించే ఎన్నికల వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలూ ఉండాలని స్పష్టం చేశారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలతో పోలిస్తే వ్యయ పరిమితి పెంచారు. 2014లో ఎంపి అభ్యర్థి పరిమితి గరిష్ఠంగా రూ.75 లక్షలు ఉండగా, 2022లో ఆ మొత్తాన్ని రూ.90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యయ పరిమితిని పెంచింది.

ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరల పట్టిక ..
ఫంక్షన్ హాల్ రూ.15,000
భారీ బెలూన్ రూ. 4,000
ఎల్‌ఈడీ తెర రూ.15,000
డీసీఎం వ్యాన్ రూ. 3,000
మినీ బస్సు రూ.3,500, పెద్ద బస్సు రూ.6,000
ఇన్నోవా రూ. 6,000
డ్రోన్ కెమెరా రూ.5,000
పెద్ద సమోసా రూ.10
లీటర్ వాటర్ బాటిల్ రూ.20
పులిహోర రూ.30 (గ్రామీణ ప్రాంతంలో రూ.20)
టిఫిన్ రూ.35 (గ్రామీణ ప్రాంతంలో రూ.30)
సాదా భోజనం రూ.80
వెజిటబుల్ బిర్యానీ రూ.80 (గ్రామాల్లో రూ.70)
చికెన్ బిర్యానీ రూ.140 (గ్రామాల్లో రూ.100)
మటన్ బిర్యానీ రూ.180 (గ్రామీణ ప్రాంతంలో రూ.150)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News