పెద్దపల్లి: కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య వైనం పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గోదావరిఖనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్‌గా అతి తక్కువ సమయంలో ఎదిగిన కొచ్చెర ప్రవీణ్ మృతి కేసులో కట్టుకున్న భార్యతో పాటు మరో ఐదుగురు నిందితులను గోదావరిఖని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారిని అరెస్ట్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని పట్టణానికి చెందిన కొచ్చెర ప్రవీణ్ విలేఖరిగా తన ప్రస్తానం ప్రారంభించి, కొంత కాలం వివిధ దినపత్రికల్లో పని చేశాడు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టి క్రమంగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ బిల్డర్‌గా కూడా ఎదుగుతూ వచ్చాడు. అతడికి లలితతో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. పెద్ద కూతురు పదవ తరగతి చదువుతూ గోదావరిఖనిలో ఉంటుండగా, మిగతా ఇద్దరు పిల్లలు వరంగల్ లో చదువుతూ, అక్కడే వసతి గృహంలో ఉంటున్నారు.
సంఘటన నేపథ్యంలో వ్యాపార రిత్యా ప్రవీణ్ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అలాగే గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడు. అప్పటి వరకు సజావుగా సాగిన వారి జీవితంలో కొచ్చెర ప్రవీణ్ అతని భార్య సంసార జీవితంలో కలకలం మొదలైంది. ఇద్దరి మద్య మనస్పర్థలు పెరిగి ఇంటిలో గొడవలు జరగడం, దీని నుంచి ఉపశమనం పొందుటకు ప్రవీణ్ మద్యానికి బానిసగా మారి తరుచుగా అధిక మొత్తంలో మద్యం సేవించి ఇంటికి రావడం, మద్యం మత్తులో భార్య భర్తల మధ్య గొడవలు జరగడం ఇది గత కొంతకాలంగా సాగుతున్నది. ఈ పరిణామాలతో విసిగి పోయిన ప్రవీణ్ భార్య లలిత ఈ సమస్య నుండి దూరం కావాలనే ఆలోచనతో ప్రవీణ్ దగ్గర సెంట్రింగ్‌గా పని చేస్తున్న రామగుండంకు చెందిన మచ్చ సురేష్‌ను ఆశ్రయించింది. మచ్చ సురేష్ వారి ఇంటికి తరుచుగా వస్తుండేవాడు. కాగా తన ఇంటి సమస్యలను సురేష్‌తో లలిత చెప్పుకునేది. దీని నుండి తనకు విముక్తి కావాలని ఈ సమస్య నుంచి బయట పడటానికి తనకు సహాయం చేయాలని మచ్చ సురేష్‌ను కోరింది. అందుకు మచ్చ సురేష్ అంగీకరించి, ప్రవీణ్‌ను అంతం చేయడానికి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
కానీ సురేష్ ఈ సంఘటనతో ఇబ్బంది పాలు కావాల్సి వస్తుందని తెలుపడంతో తన వద్ద ఉన్న ఒక ప్లాట్‌ను సురేష్‌కు ఇవ్వడానికి లలిత సిద్ద పడింది. దీంతో ఇద్దరు కలిసి ప్రవీణ్‌ను ఎవరికి అనుమానం రాకుండా చంపి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. వారి ప్రణాళికలో భాగంగా ప్రవీణ్‌ను ఊపిరి ఆడకుండా చేసి చంపడం, అది విఫలమైతే పాము కాటు వేయించి చంపాలని పథకం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో మచ్చ సురేష్ మరి కొంత మందిని పథకానికి సిద్దం చేసుకున్నాడు. అందులో ఇందారపు సతీష్‌ను సంప్రదించి, తనకు సాయం చేయాలని కోరాడు. దీనికి కొంత ప్రతిఫలం ఇస్తానని తెలిపాడు. దీనికి అంగీకరించిన మచ్చ సురేష్ స్నేహితుడు మరో స్నేహితుడు మాస శ్రీనివాస్‌ను సంప్రదించి, తనకు ఒక పాములు పట్టే వ్యక్తి కావాలని, ఒక పాము కావాలని తెలిపాడు. బీమ గణేష్ ద్వారా మందమర్రిలో పని చేస్తున్న పాములు పట్టే వ్యక్తి నన్నపు రాజు, చంద్రశేఖర్‌లను సంప్రదించాడు. తన ఖర్చులకు కొంత డబ్బులు కోరగా, లలిత వద్ద ఉన్న 34 గ్రాములు బంగారం గొలుసు ఇచ్చింది. కాగా ఈ నెల 9న కొచ్చెర ప్రవీణ్‌ను అంతమొందించుటకు పథకం వేసుకుని అందరు రామగుండంలో కలుసుకొని మద్యం సేవిస్తూ ప్రవీణ్ కదలికలను తెలుసుకున్నారు.
రాత్రి 11 గంటలకు కొచ్చెర ప్రవీణ్ మద్యం సేవించి ఇంటికి రాగా బెడ్ రూంలో అతను నిద్రకు ఉపమిక్రమించిన తరుణంలో మచ్చ సురేష్‌కు విషయం తెలిపింది. దీంతో అదనుగా భావించి మచ్చ సురేష్‌తోపాటు అతని అనుచరులు రెండు మోటార్ సైకిళ్లపై వచ్చి మార్కండేయ కాలనీలో ఉన్న కొచ్చెర ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్న ప్రవీణ్ భార్య వారికి సహకరించింది. ప్రవీణ్ వద్దకు వెళ్లిన మచ్చ సురేష్ అతనిపై ఊపిరి ఆగేలా గట్టిగా పట్టుకున్నారు. దీంతోపాటు బీమా గణేష్ మళ్లీ పాముతో కాటు వేయించారు. కొద్ది సేపటి తర్వాత ప్రవీణ్ మృతి చెందినట్లు నిర్దారించుకున్న తర్వాత వారు వెళ్లి పోయారు. ఉదయం ఆరు గంటలకు ప్రవీణ్ ఇంటి వద్దకు వచ్చిన అతని మిత్రుడికి తన భర్త నిద్రిస్తున్నాడని చెప్పిన భార్య లలిత ఇంట్లోకి వెళ్లి ప్రవీణ్‌ను లేపుతున్నట్లుగా నటించింది. ఈ క్రమంలో అతని స్నేహితుని సహకారం కూడా కోరింది. ప్రవీణ్ భార్య చుట్టు పక్కల వారికి ఏమి తెలియనట్లుగా నటిస్తూ అతనికి గుండె నొప్పి వచ్చినట్లుగా చెప్పి, చుట్టు పక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలిపారు. దీంతో అతని కుమారుని తల్లి మరియమ్మ వచ్చి మృతదేహాన్ని చూసిన తర్వాత అతని తల్లికి అనుమానం వచ్చింది.
ఇది సహజ మరణం కాదని, దీనిపై అనుమానాలు రావడంతో పోలీసులు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై ఎస్‌ఐ ప్రమోద్ సంఘటన స్థలానికి చేరుకుని మృతుడికి పోస్టుమార్టం నిర్వహించి, అతని భార్యను విచారించారు. ఈ క్రమంలో ఆమె తప్పు ఒప్పుకొని నిందితుల పేర్లు కూడా తెలుపడంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఐదు బృందాలుగా గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి వస్తువులను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఒక్కరోజులో కేసును చేదించిన పోలీసులను డీసీపీ గైక్వాడ్ అభినందించారు.