దూలపల్లిలో అటవీ శిక్షణార్థులకు ధృవపత్రాల ప్రదానం
మనతెలంగాణ/ హైదరాబాద్ : శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచాలని, అడవులు, అటవీ భూముల రక్షణ నేడు అతి పెద్ద సమస్యగా ఉందని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి, అటవీ దళాల అధిపతి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర అటవీ అకాడమీ దూలపల్లిలో 21వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారులు, 33వ బ్యాచ్ శిక్షణ అటవీ బీటు అధికారుల ప్రవేశ శిక్షణ కార్యక్రమ స్నాతకోత్సవం జరిగింది. శిక్షణార్థులకు ధృవ పత్రాలను, ప్రతిభను కనబరచిన అధికారులకు బంగారు పతకాలను, ప్రతిభా పత్రాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ శిక్షణ నైపుణ్యాల క్షేత్ర స్థాయిలో అమలు పరచాలని, పరిస్థితుల నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటూ వృత్తిని సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. అటవీ ఉద్యోగులు ఆవరణ వ్యవస్థలను కాపాడి మానవాళికి గొప్ప సేవ చేస్తున్నారని కొనియాడారు. నిజాయితీ, నిబద్దత తో పని చేయాలని అన్నారు. ఆరు నెలల శిక్షణ పొందిన 70 మంది బీట్ అధికారులు, 15 మంది అటవీ సెక్షన్ అధికారులు ఉన్నారు. వీరిలో 24 మంది మహిళా అధికారులున్నారు. కార్యక్రమంలో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (హరితహారం) సి. సువర్ణ, అకాడమీ డైరక్టర్ ఎస్. జె.ఆషా, ముఖ్య అటవీ సంరక్షణాధికారి రామలింగం, సంయుక్త డైరెక్టర్ ప్రవీణ, గంగారెడ్డి, ఆంజనేయులు, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.