Friday, December 20, 2024

హై ఓల్టేజ్ పోరుకు సర్వం సిద్ధం.. నేడు భారత్‌-పాక్ సమరం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం పోరు జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (మొతెరా) స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1.30 లక్షల మందికి పైగా అభిమానుల సమక్షంలో దాయాదుల మధ్య పోరు జరుగనుంది. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదున్నాయి.

ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌లతో జరిగిన మ్యాచుల్లో భారత్ జయభేరి మోగించింది. నెదర్లాండ్స్, శ్రీలంకలతో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్ జయకేతనం ఎగుర వేసింది. లంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 345 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. భారత్ కూడా కిందటి మ్యాచ్‌లో అఫ్గాన్‌పై కళ్లు చెదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దాయాది పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే లక్షంతో ఉంది.

జోరుమీదున్న రోహిత్..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిందటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే పాక్‌పై భారీ స్కోరును సాధించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. అతను అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇషాన్‌తో పాటు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా తదితరులు ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. అయితే శ్రేయస్ అయ్యర్‌లో నిలకడ లోపించడం ఒక్కటే కాస్త ఆందోళన కలిగిస్తోంది. కిందటి మ్యాచ్‌లో అతను బ్యాట్‌ను ఝులిపించడం సానుకూల అంశమే. ఇక బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్, హార్దిక్‌లతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు లంకతో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. రిజ్వాన్, సౌద్ షకిల్, అబ్దుల్లా షఫిక్, ఇఫ్తికార్ అహ్మద్ తదితరులు ఫామ్‌లో ఉండడం పాక్‌కు కలిసి వచ్చే అంశం. అయితే కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కీలక ఆటగాళ్లందరూ తమ సామర్థం మేరకు రాణిస్తే ఈ మ్యాచ్‌లో పాక్‌కు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. షహీన్ అఫ్రిది, హసన్ అలీ, నవాజ్, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ తదితరులతో పాక్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News