బోయినపల్లిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
మన తెలంగాణ/కంటోన్మెంట్ : ఇద్దరు కూతుర్లకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం తెల్లవారుజామున బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్సై నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం…. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని భవానినగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్‌చారి (40) సికింద్రాబాద్‌లోని ఓ వెండి దుకాణంలో ఆభరణాలను తయారు చేస్తుంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎడమ చేతిని కోల్పోయాడు. గత పది సంవత్సరాల క్రితం భూదాన్‌పోచంపల్లికి చెందిన అక్షయతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు స్రవంతి (10) శ్రావ్య (08)లు ఉన్నా రు. ప్రస్తుతం శ్రీకాంత్‌చారి తన తల్లి జయప్రద తన చెల్లెలుతో నివాసముంటున్నాడు. అందరు కలిసి మెదటి అంతస్థులో నివాసముంటున్నారు. రాత్రివేళలో మాత్రం తన భార్య పిల్లలతో శ్రీకాంత్ చారి రెండవ అంతస్థులో ఉండేవాడు. గత కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ చారి తలకు గాయాలు కావటంతో కుటుంబ సభ్యులు వైద్యం చేయించారు. పనులు లేక పోవటంతో శ్రీకాంత్‌చారి తల్లి జయప్రద ఆవసరాల నిమిత్తం డబ్బులను సర్దుబాటు చేస్తుండేది. పండుగలు సమీపిస్తున్నందున్న బంగారం వెండి దుకాణాల్లో ఏదైన పని చూసుకుంటానని ఈనెల 12 సికింద్రాబాద్ వెళ్లి తిరిగి వచ్చిన శ్రీకాంత్‌చారి రాత్రి 10 గంటల ప్రాంతంలో అందరితో కలిసి భోజనం చేసి తాను ఉంటున్న రెండో అంతస్థులో భార్య పిల్లలతో నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున తన పిల్లలకు తనవద్ద ఉన్న విషాన్ని వారికి ఇచ్చి తన భార్యకు మంచినీరు తాగు అని లేపి తాగించటంతో ఏదో తెలియని వాసన రావటంతో ఆమె నిరాకరించింది. అనంతరం ఆమె మత్తులో జారుకుంది. తెల్లవారుజామున సృహ వచ్చే సరికి తన భర్త, కూతుర్లు చలనం లేకుండా పడిఉండటంతో వెంటనే కిందకు వెళ్లి జరిగిన విషయాన్ని తన అత్త ఆడపడుచు మంజులకు విషయం చెప్పింది. బంధువుల సమాచారం అందుకున్న బేగంపేట్ ఏసిపి రామలింగారాజు, బోయిన్‌పల్లి సిఐ లక్ష్మీనారయణ రెడ్డి, ఎస్సైలు నాగేంద్రబాలు వివరాలను సేకరించి మృత దేహాలను పోస్ట్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
బోరబండలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన తల్లి అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం బోరబండంలో చోటుచేసుకుంది. అయితే భార్య, పిల్లల మృతిని తట్టుకోలే భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం… బోరబండ, రాజ్‌నగర్‌కు చెందిన జ్యోతి (31) ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు అర్జున్(4), ఆదిత్య(2) ఉన్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. ఏమి జరిగిందో కానీ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ వారి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు తెలిపారు.