హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా తర్వాత పొన్నాల చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శనివారం పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకొని ఆయనని బిఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడారు. కెటిఆర్ వచ్చి బిఆర్ఎస్ పార్టీలోకి నన్ను ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రావాలని కెటిఆర్ కోరారు. రేపు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తానని పొన్నాల మీడియాతో వెల్లడించారు.
రేవంత్ రెడ్డి మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా.. పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేశారు. నా బ్యాంగ్రౌండ్ ఏంటో రేవంత్ తెలుసుకోవాలని పొన్నాల హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవలేదు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో రేవంత్ తన పార్లమెంట్ పరిధిలో ఎన్ని సీట్లు గెలిచారని పొన్నాల ప్రశ్నించారు. ఐకమత్యమే బలం… ఈ విషయం రేవంత్ మర్చిపోయారని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా అని పొన్నాల పేర్కొన్నారు.