సిటిబ్యూరోః ప్రియుడు మోసం చేయడం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా, బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక(23) గ్రూప్స్‌కు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా అశోక్‌నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్‌లో 15 రోజుల క్రితం చేరింది. హాస్టల్‌లో శుత్రి, సంధ్య, ప్రవళిక ఒకే రూమ్‌లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ప్రవళిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోస్గికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడిని ప్రవళిక ప్రేమించింది. ఇద్దరు తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు, ఛాటింగ్ చేసుకునేవారు.
ఇద్దరు కలిసి శుక్రవారం ఉదయం బాలాజీ దర్శన్ హోటల్ లో టిఫిన్ చేశారు. రాత్రి ఇద్దరు కలిసి ఛాటింగ్ చేసుకున్నారు. అందులో శివరామ్ రాథోడ్ వేరే యువతిని వివాహం చేసుకుంటున్నట్లు ప్రవళిక కు తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన ప్రవళిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీళ్లు ఇద్దరు ప్రేమించుకున్న విషయం ప్రవళిక తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. ప్రవళిక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని రిపోర్టు రాగానే ఆమె ప్రియుడు శివరాంపై కేసు నమోదు చేస్తామని డిసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రియుడు మోసం చేశాడనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె స్నేహితులు చెప్పారని తెలిపారు. శుక్రవారం రాత్రి ధర్నా చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
నివేదిక కోరిన గవర్నర్…
గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు. నిరుద్యోగ యువతి, యువకులు అధైర్య పడొద్దని గవర్నర్ కోరారు.