Saturday, November 16, 2024

మందకొడిగా రబీ పంటల సాగు

- Advertisement -
- Advertisement -

దేశమంతటా 7.41లక్షల హెక్టార్లకు చేరిన విస్తీర్ణం

మనతెలంగాణ/హైదరాబాద్: ఈసారి వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు ఆశించిన రీతిలో అనుకూలించటం లేదు. పలు రాష్ట్రాల్లో వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వర్షాకాల సీజన్‌లో సాధారణ వర్షాలు కూడా పడలేదు. వర్షాకాలం ముగిసి పోయింది. నైరుతి రుతుపవనాలు కూడా దేశం నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రబీపంటల సాగు సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడిచినా కాడి ముందుకు కదలటం లేదు. పంటల సాగు మందకొడిగా సాగుతోంది. వర్షాకాలంలో రుతుపవనాల ప్రభావం కూడా రబీ సీజన్‌పై పడింది. ప్రధాన జలాశయాల్లో నీటి వనరులు అడుగంటడం. వర్షాధార ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గిపోయి విత్తనాలు వేసుకునేందుకు తగినంత పదును లేకపోవటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

అంతే కాకుండా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలకుపైగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నేలలో తేమశాతం వేగంగా పడిపోతోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నాలుగు నెలలపాటు నైరుతిరుతు పవనాల వల్ల ఈ సీజన్‌లో దేశ సగటు వర్షపాతం 868.6 మి.మీ కాగా, వర్షాకాలం మగిసే నాటికి 820మి.మి వర్షపాతం నమోదయింది. అయితే ఈ వర్షాలు ప్రతి నెల కురవాల్సినంత సాధారణ స్థాయిలో లేకపోగా, ఒక నెల అతి వృష్ఠి ,మరో నెల అనావృష్టి అన్నట్టుగా వర్షాకాలం ముగిసి పోయింది.

ఈ సారి నైరుతి రుతుపవనాల్లో అస్థిరత ఏర్పడిందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు.దేశంలో 36 వాతావరణ సబ్ డివిజన్లు ఉండగా ,అందులో మూడు డివిజన్లలో మాత్రమే అధికంగా వర్షాలు పడ్డాయి. మరో 26 సబ్‌డివిజన్లలో సాధారణ వర్షపాతం నమోదు జరిగింది. ఏడు సబ్‌డివిజన్లలో లోటు వర్షపాతం ఏర్పడగా, ప్రత్యేకించి దక్షిణాదిన వున్న తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, కేరళ , తమిళనాడు రాష్ట్రాల్లో 8శాతం లోటు వర్షపాతం నమోదయింది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లోని పలు జిల్లాలు ఇప్పటికీ తీవ్ర వర్షభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆశలన్నీ ఈశాన్య రుతుపవాలనా పైనే:
నైరుతి రుతువపనాలు దేశం నుంచి నిష్క్రమిస్తుండగా , మరోవైపు రబీపంటల సీజన్ కూడా ప్రారంభమైంది.ఆక్టోబర్ నుంచి డిసెంబర్‌వరకూ పంటల సాగుకు అదను కాలంగా భావించే ఈ సీజన్‌లో వ్యవసాయరంగం ఆశలన్ని ఈశాన్య రుతుపవనాల పైనే కేంద్రకృతమై ఉన్నాయి. దేశవ్యాప్తంగా రబీ పంటల సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్న పంటల సాగు మాత్రం మందకొడిగానే సాగుతోంది. కేంద్ర వ్యవసాయశాఖ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 14నాటికి దేశమంతటా అన్ని రకాల పంటలు కలిపి 7.46లక్షల హెక్టార్లలోనే రబి పంటలు సాగులోకి వచ్చాయి. గత ఏడాది రబీ సీజన్‌లో ఈ సమయానికి 13.10లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనం పడింది. గత ఏడాదితో పోలిస్తే 5.64లక్షల హెక్టార్ల మేరకు వెనుకబడ్డట్టు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులు , వాతావరణ ప్రతికూలత వల్లే రబీ పంటల సాగు ఉత్సాహంగా ముందుకు సాగలేకపోతోంది. ఇప్పటివరకూ సాగులోకి వచ్చిన పంటల్లో వరి నాట్లు 1.29 లక్షల హెక్టార్లలో పడ్డాయి. మరో 0.30లక్షల హెక్టార్లలో పప్పుదినుసు పంటలు సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటలు 5.81లక్షల హెక్టార్లలో సాగు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News