Friday, November 1, 2024

దక్షిణాది హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది 2023 నవంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్‌గఢ్ , తెలంగాణ) కీలకమైనవిగా మారుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మూడుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా రికార్డు సృష్టించనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వస్తే బిఆర్‌ఎస్‌ది ఒక సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు. కానీ గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొనడంతో బిఆర్‌ఎస్‌కు రావడం అంత సులువు కాదని అర్థమవుతోంది. 1957 నుండి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ఐదు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1994, 1999లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అదే విధంగా 2004, 2009లో రెండు సార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014, 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ వరుసగా రెండు పర్యాయాలు గెలిచి నేడు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. 2023లో మళ్ళీ గెలిస్తే ఒక రికార్డు. ఏప్రిల్ 27, 2001న ‘హైదరాబాద్’ రాజధానిగా ఒక విశిష్ట ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతర ఉద్యమాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. 2023 చివరిలో జరగబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి సరికొత్త రికార్డు సాధించాలని బిఆర్‌ఎస్ కృతనిశ్చయంతో ఉంది. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ 2018లో 88 స్థానాలను గెలిచింది. కానీ 2023లో జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు బదులు బిఆర్‌ఎస్‌తో బరిలోకి దిగనుంది. పార్టీ రంగు, గుర్తు మార లేదు, కానీ పార్టీ పేరు మారింది. జాతీయ స్థాయిలో పార్టీగా మారిన ఈ పేరును ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో రాబోయే ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం చాలా అరుదు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే చేశారు. బిఆర్‌ఎస్ తన పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పింది అది కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలవటానికి ఉపయోగపడుతుంది. భారత దేశంలో కొత్తగా ఏర్పడిన, చిన్న రాష్ట్రమైన తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్‌ఎస్ మరిన్ని అనుకూల అంశాలతో పాటు, కొంత వ్యతిరేకత సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. కానీ వాటిని కూడా స్వీకరించి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ మూడోసారి అధికారం పొందేలా కృషి చేస్తున్నది. రాజకీయాలలో అనుకూల, ప్రతికుల అంశాలు సర్వ సాధారణమే. వంద శాతం ప్రజా ఆమోద రాజకీయ పార్టీ ప్రపంచంలోనే లేదని గమనించాలి. అదే విధంగా దక్షిణ భారత దేశం నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా హ్యాట్రిక్ సాధించలేదు. కాబట్టి కెసిఆర్ ఇప్పుడు ఆ చరిత్ర సృష్టించాలి. కేవలం కెసిఆర్‌కు మాత్రమే ఉన్న గొప్ప అవకాశం ఇది. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారి జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా మారాలని అవతరించిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ కాకుండా దేశ అభివృద్ధి,

తెలంగాణ మోడల్, పదేళ్ళ పురోగతి అంశాలతో జరగబోయే తొలి ఎన్నికలు ఇవి. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు టిఆర్‌ఎస్ పోరాడింది. తన జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా పేరు మార్చి, ప్రగతిశీల తెలంగాణ నిర్మాణంలో ఆయన సాధించిన విజయాల వెలుగులో ‘తెలంగాణ మోడల్ పాలన’ను మిగిలిన రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్‌ని అవలంబించాలని ఈసారి జాతీయ స్థాయిలో ప్రభావం కోసం పని చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ముఖ్యమైన ఎన్నికలుగా చెప్పవచ్చు.ఈసారి ఎన్నికల పోరు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం, జాతీయ సగటు కంటే గణనీయంగా పెరిగిన వృద్ధి రేటు, అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం, రైతు, దళిత, బంధు వంటి కొత్త కార్యక్రమాలతో తెలంగాణ ఒక మోడల్ రాష్ట్రంగా ఎలా ఎదిగిందో అధికార బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నొక్కి చెబుతూనే ఉన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టని కొన్ని కొత్త పథకాలు బిఆర్‌ఎస్ విజయానికి ఉపయోగపడే ప్రధాన కారకాలుగా చెప్పొచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం అంత సులభం కాదని విపక్షాలు చెప్తున్నాయి.

ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత, ప్రధాన డిక్లరేషన్లు, ఆరు హామీల తర్వాత మళ్లీ పుంజుకుంటున్నదని, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను ఆకర్షిస్తోందని, 2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపి కూడా పుంజుకుంటుందని పలు వర్గాల వాదన ఉన్నప్పటికీ బిఆర్‌ఎస్ పార్టీ ఓటు బ్యాంకు అలాగే పదిలంగా ఉంది. పార్టీ పేరు మార్చిన తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు విస్తరించి జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలు బిఆర్‌ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో మరింత ప్రభావం చూపేందుకు కృషి చేయవచ్చు కాబట్టి బిఆర్‌ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు, సత్తా చాటేందుకు ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలకు మించి సరికొత్త పథకాలు లేదా కార్యక్రమాలను ప్రవేశపెట్టేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంది. అందుకోసం త్వరలోనే ఒక సరికొత్త మేనిఫెస్టోని విడుదల చేసే పనిలో ఉంది.

ఈ కొత్త కార్యక్రమాల ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తూ, వారి మన్ననలు కూడా పొందుతుంది. అందులో భాగంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులవృత్తుల వారికి ఆర్థిక సాయం, కొత్త డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, గిరిజనులకు పోడు భూముల పంపిణీ, షెడ్యూల్ రిజర్వేషన్ల పెంపు, గిరిజనులు 6 నుంచి 10 శాతం వరకు, పేద ముస్లిం ప్రజలకు ఆర్థిక సహాయం, వికలాంగులకు పెన్షన్ పెంపు వంటి పలు కార్యక్రమాలను చేపట్టింది. అదే విధంగా ఎన్నికలకు ముందు కొత్త కార్యక్రమాలు ప్రకటిస్తే ఓటర్లను ఆకర్షించి ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని బిఆర్‌ఎస్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలతో పోల్చినప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ నేడు బలంగా ఉన్న ఉద్యమ పార్టీ, రాబోయే కాలంలో ‘హ్యాట్రిక్’ దిశగా రావడానికి, మూడోసారి అధికారంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News