Sunday, December 22, 2024

‘హస్తం’ పార్టీలో అసంతృప్తుల సెగ..

- Advertisement -
- Advertisement -

‘హస్తం’ పార్టీలో అసంతృప్తుల సెగ
తొలి జాబితా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు
రాజీనామా దిశగా పలువురు కాంగ్రెస్ నాయకులు
రేవంత్ ఓటమి కోసం పనిచేస్తామని ప్రకటనలు
రేవంత్‌పై తిట్ల వర్షం కురిపిస్తున్న టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు
హైదరాబాద్: మొదటి విడత జాబితా వెలువడగానే హస్తం పార్టీలో అసంతృప్తుల సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మేడ్చల్, మల్కాజిగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆశావహుల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. పలువురు రేవంత్‌తో పాటు పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పలువురు కాంగ్రెస్ అసంతృప్త నాయకులు రేవంత్‌పై తిట్ల వర్షం కురిపించారు. రేవంత్ బాధితులను తీసుకొని కోడంగల్‌లో రేవంత్‌ను ఓడిస్తామని పలువురు శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.

రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయా: సోమశేఖర్ రెడ్డి
ఇక ఉప్పల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి, ఎఎస్‌రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డి సైతం రాజీనామా చేసేందుకు రెడీ కావడం విశేషం.ఈ నేపథ్యంలోనే ఎఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయానని రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తనలాంటి రేవంత్ బాధితులను కలుపుకొని కొడంగల్లో రేవంత్‌ను ఓడిస్తానని ఆయన శపథం చేశారు. ఉప్పల్‌లో తనకు టికెట్ ఇస్తే తాను గెలుస్తానని అన్నీ సర్వేల్లో తేలిందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు సీట్లలో ఒకటి తన భార్య కార్పొరేటర్‌గా గెలవడం గమనార్హమన్నారు.

టిడిపి మాదిరిగా కాంగ్రెస్‌ను కూడా నాశనం చేసి…..
తొమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశానని, పార్టీ చచ్చిపోతున్న పరిస్థితుల్లో పార్టీలో ఎవరు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్నానని, 2014లో టికెట్ ఇస్తానన్నారని, ఆ తరువాత 2018లో టికెట్ ఇస్తానని, అనంతరం ఇప్పుడు కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని ఆయన వాపోయారు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదని, బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపిలాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీని స్థాపించాలని రేవంత్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

సిఎం పదవి కోసం రేవంత్ ప్రైవేటు సైన్యం
సిఎం పదవి కోసం ప్రైవేటు ఆర్మీని రేవంత్ నిర్మించుకున్నాడని, రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో తంతే మల్కాజిగిరిలో తాము గెలిపించుకున్నామన్నారు. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని, రేవంత్ బాధితులు అంత తనతో కలిసి రావాలని, అందరి తరుపున తాను కొట్లాడుతానని ఆయన తెలిపారు. కొడంగల్‌లో రేవంత్ ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తానని, 300 మంది రేవంత్ బాధితులు తనతో ఉన్నారని, తమతో వందల కోట్లు రేవంత్ ఖర్చు చేయించాడని ఆయన ఆరోపించారు.

రేపటి నుంచి రేవంత్‌కు వ్యతిరేకంగా పని చేస్తా
ఇన్ని రోజులు రేవంత్ కోసం పని చేసిన తాను పనిచేశానని, రేపటి నుంచి రేవంత్‌కు వ్యతిరేకంగా పని చేస్తానని, రేవంత్ రెడ్డికి హటావో, కాంగ్రెస్‌కు బచావో అనే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళతానన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాళ్లకు గజ్జెలు కట్టుకుని తిరుగుతానని, రేవంత్ ని ఓడగొడుతానని సోమశేఖర్ రెడ్డి శపథం చేశారు. నా నియోజకవర్గానికి పోవాలంటే సిగ్గు అవుతుందని, 15 రోజుల నుంచి ఢిల్లీలో దాకున్న కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీని ఎలా ఎదిరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉప్పల్లో పార్టీ ఖాళీ అవుతుందని, తనకు, తన ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ఆయన తెలిపారు.

రేవంత్‌కు నా ఉసురు తాకుతుంది: రాగిడి లక్ష్మారెడ్డి
ఇక ఉప్పల్ నియోజకవర్గంలో టికెట్ ఆశించిన ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉప్పల్ టికెట్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డికి కేటాయించడంతో బిబ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని, పొత్తులో భాగంగా గతంలో తన సీటు పోయినా పని చేశానని రాగిడి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే మల్కాజిగిరి ఎంపిగా ఆహ్వానించి ఆయన్ను గెలిపించుకున్నామన్నారు. వత్తాసు పలికే వారికే రేవంత్ రెడ్డి టికెట్లు కేటాయిస్తున్నారని రాగిడి లకా్ష్మరెడ్డి మండిపడ్డారు. తన ఉసురు రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగులుతుందని ఆయన శపించారు. కాంగ్రెస్‌లో కార్యకర్తలకు న్యాయం జరగదని, 119 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని రాగిడి లక్ష్మారెడ్డి సంచలన కామెంట్ చేశారు.

కీసరలో తన అనుచరులతో సమావేశమైన హరివర్దన్ రెడ్డి
మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్య యాదవ్‌కు కేటాయించడంతో అదే టికెట్ ఆశించిన కాంగ్రెస్ జిల్లా జెడ్పీ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలిసింది. కీసర కాంగ్రెస్ కార్యాలయంలో హరివర్దన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణను ప్రకటించడానికి సిద్ధమయినట్టుగా సమాచారం. ప్రస్తుతం మూడు చింతలపల్లి జెడ్పీటిసిగా ఎన్నికైన హరివర్దన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా పరిషత్ పార్టీ ఫ్లోర్ లీడర్, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News