Sunday, December 22, 2024

ప్రచారానికి బాలయ్య

- Advertisement -
- Advertisement -

జనసేనానితో పొత్తు కుదిరితే పవన్ కూడా రాక
చంద్రబాబు విడుదలపై ఇంకా రాని స్పష్టత
తను వస్తే ఇక టి టిడిపికి తీరుగులేదంటున్న వైనం

మన తెలంగాణ / హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో ఓ మెగా స్టార్.. అతను తెలుగుదేశం పార్టీలోను ఇప్పుడు కీలక వ్యక్తిగా ఉండనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు తమ పార్టీ అధినేత చంద్రబాబును సిబిఐ , ఏపి పాలకులు జైలులో ఉంచేలా చేశాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బాలయ్యనే ప్రచారానికి వస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ఔను..ప్రచారానికి వస్తారు.. అని స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని రాజమహేంద్రవరం జైలులో కలిశాక ఇటీవల ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన బాలయ్య ఈ సారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తాను కూడా కీలక పాత్ర పోషిస్తానని ప్రకటన చేశారు.

ఒక వేళ చంద్రబాబు విడుదల కాకుంటే ఇక తమ పార్టీకి బాలయ్యనే పెద్ద దిక్కుగా ఉండబోతారని ఆ పార్టీ నేతలు చెప్పడం గమనార్హం. కిందటి సారి మావ చంద్రబాబు తరఫున ఏపి ఎన్నికల్లోనూ బాలయ్య సుడిగాలి పర్యటనలు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను ఏపిలోని హిందూపూర్‌లో పోటీ చేసి గెలుపొందారు. అదే ఊపును తెలంగాణలోనూ కనబరుస్తారని భావించిన తెలంగాణ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇటీవల బాలయ్యా.. మా దగ్గరకు ప్రచారానికి రావయ్యా అంటూ బాలయ్యను ప్రచారానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారానికి రావాలని బాలకృష్ణను వారు కోరారు. వారి ఆహ్వానంపై బాలయ్య కూడా సానుకూలంగా స్పందించిన ఆయన ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లోనూ ఓ ప్రెస్‌మీట్ నిర్వహించి తన మద్దతు తప్పకుండా ఉంటుందని పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అప్పట్లో సారథి స్టుడియోలో ఎన్‌టిఆర్ బయోపిక్‌కు సంబంధించి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు రావడంతో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఎన్‌టిఆర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని , పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాలయ్యతో పంచుకున్నారని టాక్.

జన సేనానితో పొత్తు కుదిరితే పవన్ కూడా..
కాగా జన సేనాని పవన్ కళ్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరితే గనుక ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారని టాక్ వినిపిస్తోంది. అటు ఏపిలో ఆపార్టీతో మంతనాలు కూడా జరుగుతున్నాయని, అక్కడ ఓకే అయితే అతను తెలంగాణలోనూ ప్రచారం చేస్తారని అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాస్త ఘాటుగానే ఉంటాయని, అది తెలంగాణ బిడ్దలు ఎలా స్వీకరిస్తారో వేచి చూద్దామని పార్టీ నేతలు అంటుండడం గమనార్హం. ఇప్పటికే ఏపిలో దూకుడు పెంచిన వవన్ కళ్యాణ్ తిరుపతిలోనూ భారీ బహిరంగ సభ నిర్వహించి ఏపి సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక అక్కడి సర్కారు ఖంగుతిందని చెబుతున్నారు. అదే ఊపుతో తెలంగాణలోనే పవన్ టి టిడిపికి ప్రచారం చేసిపెడతారని ఆ పార్టీ వర్గాలు ఆశతో ఉన్నాయి. ఇటు వవన్ కళ్యాన్.. అటు నందమూరి బాలకృష్ణ ఇద్దరు సినీ ఫిల్డ్‌కు చెందిన వారే కావడం.. తెలంగాణలోనూ వారి భావజాలాలను ఇక్కడి వారు ఎలా స్వీకరించనున్నారోనని ప్రచారం జోరందుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News