Sunday, January 19, 2025

నిందితుల బోనులోకి యావత్తూ ఆప్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్త సంచలనాలు ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు మొత్తం ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ను చిక్కుల్లోకి నెట్టింది. లిక్కర్ స్కామ్ అవినీతి, మనీలాండరింగ్ వ్యవహారాలలో నిందితుల పేర్ల జాబితాలో ఆప్‌ను చేర్చే యోచనలో ఉన్నట్లు కేంద్రీయ దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడిలు సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ దరఖాస్తు విచారణ దశలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రెండు దర్యాప్తు సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్‌వి రాజు తమ వాదన విన్పించారు.మనీలాండరింగ్, అవినీతి నిరోధక చట్టం నిబంధనల వంటి పలు విస్తృత కట్టుబాట్ల పరిధిలో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చేందుకు వీలుందని తెలిపారు. చట్టం పరిధిలో ఆప్‌ను నిందిత స్థానంలోకి తీసుకువచ్చి విచారణ ప్రక్రియను చేపట్టాలని తమ సంస్థలు ఆలోచిస్తున్నట్లు,

దీనిని కోర్టుకు తెలియచేయాలనే విషయాన్ని తమకు తెలిపినట్లు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ముందు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. ఇంతవరకూ ఆప్ నేతలపై వేర్వేరుగా విచారణలు సాగుతున్నాయి. సిబిఐ, ఇడిలు దర్యాప్తు క్రమంలో తేల్చిన అంశాలతో నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఈ దశలో విడిగా ఆప్‌పై ప్రత్యేక అభియోగాలు దాఖలు చేస్తారా? ఇప్పుడు ఉన్న కేసులతో కలిపి ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చి విచారణ కోరుతారా? అనేది తమకు స్పష్టం కావాలని తెలిపిన ధర్మాసనం సంస్థల వైఖరిని మంగళవారం తమకు వెల్లడించేలా చూడాలని ఆదేశించారు. ముందుగా సంస్థల నుంచి నిర్థిష్ట ఆదేశాలు తీసుకుని న్యాయస్థానానికి వస్తే మంచిది. ఒకే విధమైన అభియోగాలు ఉంటాయా? ఆప్‌ను వీటికి బాధ్యులు చేస్తారా? లేక ఈ కేసులకు సంబంధించి వేర్వేరు అంశాలను తీసుకుని అభియోగాలు ఉంటాయా? అనేది తేల్చాల్సి ఉందని చెప్పారు.

పార్టీ నేత సిసోడియా చాలా నెలలుగా లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్‌ను ఇటీవలే ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇక లిక్కర్ పాలసీతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపిస్తున్నందున ఈ న్యాయపరమైన ప్రశ్నకు తగు సమాధానం మంగళవారం తమకు తెలియచేయాలని సిసోడియా తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News