Monday, December 23, 2024

వైట్ కోట్ విప్లవం

- Advertisement -
- Advertisement -

ఎంబిబిఎస్ పట్టా సాధించి డాక్టర్ కావాలనే పట్టుదలతో విదేశీ విమానాలెక్కిన తెలంగాణ విద్యార్థులు ఎంతో మంది. దీని వెనుక ఆ విద్యార్థుల తల్లిదండ్రుల కృషి అనన్యసామాన్యమైనది. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకున్న ఆస్తులు సైతం అమ్ముకునేందుకూ వారు వెనుకడుగు వేయలేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదంతా గతం. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే చందంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితి తారుమారైంది. ఎంబిబిఎస్ పట్టా కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రానికి వెళ్తే సరిపోతుందనే విధంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తీర్చిదిద్దింది. అందుకే దేశంలోని వైద్య విద్యార్థులు పోటీపడుతున్నారు. పోటీపడుతున్న విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలల్లో మాకు సీట్లు కావాలని కొందరు వైద్య విద్యార్థులు కోర్టు మెట్లెక్కడం విడ్డూరం. 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ఇందుకోసం జారీ చేసిన జీవో 72ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు విద్యార్థులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 72 చట్టబద్ధమే. 1974 జులై 3వ తేదీ నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 5, 6 పేరాలకు విరుద్ధం కానే కాదు. ఆలిండియా కోటా 15% మినహా మిగిలిన కాంపిటెంట్ పూల్ కోటాలోని 85% సీట్లు స్థానిక తెలంగాణ విద్యార్థులకే చెందుతాయని మెడికల్ సీట్ల స్థానికతపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రవణ్‌కుమార్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే కాదు, తెలంగాణ ప్రభుత్వం విజయంగా అభివర్ణించవచ్చు. ఎంబిబిఎస్ బి కేటగిరి సీట్లలో 85% సీట్లను స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే తాజా హైకోర్టు తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి.ఈ రెండు నిర్ణయాల కారణంగా తెలంగాణ వైద్య విద్యార్థులకు ఏటా 1,820 సీట్లు దక్కనున్నాయి.

అంటే ఇవి దాదాపు 20 మెడికల్ కాలేజీలతో సమానం కావడం గమనార్హం. ఇప్పటికే జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది అదనపు బలం కాగా, విద్యార్థులకు అదనపు ప్రయోజనం చేకూరుతుండటం శుభసూచకం. ‘అభివృద్ధి’ అనే వ్యవసాయంలో విద్య, వైద్యరంగాలు జోడెడ్ల వంటివి. ఈ రెండు సమంగా నడిస్తేనే వ్యవసాయం సాగుతుంది. దీంట్లో ఏ ఒక్కటి మొండికేసినా కాడి కూలబడుతుంది. ఈ సత్యాన్ని మొదట్లోనే గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నది. అందుకు తగ్గ విజయాలను సాధిస్తున్నది. మా సీట్లు మాకే దక్కాయన్న ఆనందం వైద్య విద్యార్థుల్లో వెల్లివిరుస్తున్నది.-

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News