Saturday, January 11, 2025

ఏళ్లుగా కలిసి ఉన్నా.. సింగిల్ పేరెంట్స్‌గానే ఉండిపోతున్నాం

- Advertisement -
- Advertisement -

జంటగా దత్తత కలగానే మిగిలిపోయింది
ఏళ్లుగా కలిసి ఉన్నా సింగిల్ పేరెంట్స్‌గానే ఉండిపోతున్నాం
‘సుప్రీం’ తీర్పుపై స్వలింగ సంపర్క జంటల ఆవేదన

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశంలో ఎన్నో ఏళ్లుగా కలిసి జీవిస్తున్న స్వలింగ సంపర్క జంటలకు అశనిపాతమే అయింది. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని, తాము కూడా పిల్లలతో కలిసి ఒక కుటుంబంగా సమాజంలో అందరి మాదిరిగా జీవించవచ్చన్న వారి కలలు కల్లలుగానే మిగిలి పోయాయనే చెప్పాలి. ఈ తీర్పుతో వారంతా హతాశులయ్యారు. ‘మా భాగస్వామ్యాన్ని గుర్తించడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం మా దైనందిన ఉనికిపై చెరిగిపోని మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది నిజంగానే అత్యంత బాధాకరమైన విషయం ’ అని బెంగళూరుకు చెందిన ఓ గే జంట వాపోయింది. రిషి, ఆరన్(పేర్లు మార్చారు) అనే ఇద్దరూ మగవాళ్లే. వారిద్దరూ 15 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఈ ఇద్దరూ సింగిల్ పేరెంట్స్‌గా ఇద్దరు మగ పిల్లలను 2016లో ఒకరిని, 2022లో మరొకరిని దత్తత తీసుకున్నారు.‘ మేము ఒకరినొకరు గాఢంగా ప్రేమిస్తున్నామని మా పిల్లలకు తెలుసు.

అయితే చట్టం మా ప్రేమ నిజమైనదిగా గుర్తించలేదని వారు మాకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటారు. ఈ భావోద్వేగపు భారం భరించలేనిదే కాకుండా ఇది మా పిల్లలపై ప్రతి రోజూ ప్రభావం చూపిస్తుంది’ అని ఆర్యన్ ఫోన్‌లో పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. రిషి కూడా ఇదే రకమైన ఆవేదనను వ్యక్తం చేశాడు.‘ చట్టబద్ధంగా గుర్తింపు పొందిన తల్లిదండ్రులతో ఒక ఇంట్లో పెరిగేందుకు మా పిల్లలకు అన్ని విధాలా అర్హత ఉంది. అయితే మేము ఒక జంటగా, లేదా పెళ్లి చేసుకున్నా దత్తత తీసుకోలేమన్న వాస్తవం మా కుటుంబం భిన్నమైనదనే సందేశాన్ని వారికి ఇస్తుంది. ఇది ఆ చిన్నారులకు భరించలేనంత భారం’ అని అతను ఆవేదనగా అన్నాడు.

సుప్రీంకోర్టు తీర్పు స్వలింగ సంపర్కుల వివాహాల గుర్తింపు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అనేక ఎల్‌జిబిటి జంటలను కలవరానికి గురి చేశాయి. ఒక్క రిషి, ఆర్యన్‌లే కాదు చాలాజంటలు ఇదే రకమైన ఆవేదనకు లోనవుతున్నాయి.ఈ కేసులో ప్రధాన పిటిషన్‌దారయిన అంబురి రాయ్ తన భాగస్వామి అపర్ణా సామాను వివాహం చేసుకోవడం కోసం 2021లో డెన్మార్క్‌కు వలస వెళ్లాడు. అయితే వారిద్దరూ కలిసి ఒక బిడ్డ్డను దత్తత తీసుకోలేకపోయారు.‘ ‘మేము గనుక ఒక బిడ్డను దత్తత తీసుకుంటే ఇంట్లో మేమిద్దరమూ తల్లులుగా ఉంటాం. కానీ మాలోఒకరు పబ్లిక్‌లో ‘ఆంటీ’గా పిలవబడతారు. ఎందుకంటే మేము ఇంకా జంటగా గుర్తింపు పొందలేదు. మేము సింగిల్ పేరెంట్స్‌గా దత్తత తీసుకోవచ్చు కానీ జంటగా కాదని మాకు తెలిసింది. ఇది ఒక తల్లిదండులుగా ఒక బిడ్డను పెంచాలన్న మా కలకు అడ్డుగా మారుతోంది’ అని బెర్లిన్‌లో ఉంటున్న అంబురి అన్నారు.

ఉరుగ్రామ్‌కు చెందిన రాహుల్, అమిత్( వీరిద్దరి పేర్లు మార్చడం జరిగింది)ది కూడా ఇలాంటి కథే. ఎనిమిదేళ్లుగా కలిసి ఉన్న ఈ జంట మామూలు భార్యాభర్తల్లాగా తమ బిడ్డకు చట్టబద్ధ రక్షణ కల్పించలేకపోతున్నారు. ‘మా ప్రేమ పూర్తిగా గుర్తింపు పొందని ప్రపంచంలో మా బిడ్డ పెరుగుతోందని ఊహించుకోవడం బాధగా ఉంది’అని రాహుల్ ఆవేదనగా అన్నాడు.2017 దత్తత నిబంధనల ప్రకారం సింగిల్ పేరెంట్స్ ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చు. మహిళలు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కానీ పురుషులు ఆడబిడ్డను దత్తత తీసుకోరాదని కూడా ఆ నిబంధన చెప్తోంది. సుప్రీంకోర్టు తీర్పు హృదయ విదారకమని స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్న వారి తరఫు న్యాయవాది సంధ్యా హోనావార్ అన్నారు.

ఎల్‌జిబిటిలు పెళ్లి చేసుకోవడానికి, బిడ్డలను దత్తత తీసుకోవడానికి అనుమతించే చట్టంపై మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అయితే ఆ కలలన్నీ ఇప్పుడు కల్లలయ్యాయి. ఇది నిజంగా గట్టి ఎదురుదెబ్బే. పెళ్లికి గుర్తింపుతో పాటుగా వారసత్వం, దత్తతకు సంబంధించిన హక్కులకు ఇప్పటికీ సమాధానాలు లేవు’ అని హోనావార్ అన్నారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థల నాయకులు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఓ సానుకూల పరిణామంగా భావిస్తున్న వారూ ఉన్నారు. ‘ఈ తీర్పు తమ హక్కుల కోసం ఎల్‌జిబిటిలు మరింత గట్టిగా పోరాడడానికి స్ఫూర్తినిస్తుంది’ అని బెంగళూరుకు చెందిన గే శుభాంకర్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News