Monday, November 18, 2024

ఛాంపియన్‌కు వరుస షాక్‌లు..

- Advertisement -
- Advertisement -

వరల్డ్‌కప్‌లో తేలిపోతున్న ఇంగ్లండ్
మన తెలంగాణ/ క్రీడా విభాగం: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో అవమానకర రీతిలో పరాజయం పాలైన ఇంగ్లండ్‌కు పసికూన అఫ్గానిస్థాన్ చేతిలోనూ చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్‌కప్‌నకు ముందు ఇంగ్లండ్ అసాధారణ ఆటతో అలరించింది. మెగా టోర్నమెంట్‌లోనూ ఇంగ్లీష్ టీమ్‌కు ఎదురు ఉండదని అందరు భావించారు. కానీ ఇంగ్లండ్ మాత్రం ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోరును సాధించినా ఫలితం లేకుండా పోయింది. డేవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర అజేయ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్‌కు భారీ ఓటమి తప్పలేదు.

ఇక కివీస్‌తో పోల్చితే చాలా బలహీనంగా ఉన్న అఫ్గాన్ చేతిలో ఎదురైన పరాజయం ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ బౌలర్లు విఫలమయ్యారు. తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయం పాలైన అఫ్గాన్‌కు హ్యాట్రిక్ ఓటమి ఖాయమని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఇంగ్లండ్ మాత్రం అఫ్గాన్‌ను ఓడించడంలో విఫలమైంది. తొలుత బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లు పూర్తిగా తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 284 పరుగుల భారీ స్కోరును సాధించింది. గుర్బాజ్, ఇక్రామ్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను హడలెత్తించారు.

ఇక బౌలింగ్‌లోనూ అఫ్గాన్ ఆటగాళ్లు స్ఫూర్తి దాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో అఫ్గాన్ బౌలర్లు సఫలమయ్యారు. డేవిడ్ మలన్, హారి బ్రూక్ తప్ప మిగతా బ్యాటర్లు అఫ్గాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొలేక పోయారు. బెయిర్‌స్టో, రూట్, బట్లర్, లివింగ్‌స్టోన్, శామ్ కరన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్న ఇంగ్లండ్‌ను అఫ్గాన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వీరి ధాటికి తట్టుకోలేక ఇంగ్లండ్ 215 పరుగులకే కుప్పకూలింది. ముజీబుర్ రహ్మాన్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్‌లు అద్భుత బౌలింగ్‌తో అలరించారు.

ఇలా ఆడితే కష్టమే..

మరోవైపు వన్డేల్లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్న ఇంగ్లండ్ వరల్డ్‌కప్‌లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ప్రస్తుత విజేత ఇంగ్లండ్ ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై గెలిచిన ఇంగ్లండ్‌కు కివీస్, అఫ్గాన్ చేతుల్లో ఓటమి తప్పలేదు. రానున్న మ్యాచుల్లో ఒక్క నెదర్లాండ్స్‌ను తప్పిస్తే ఇంగ్లండ్ పెద్ద జట్లతోనే తలపడాల్సి ఉంది. సౌతాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక వంటి అగ్రశ్రేణి టీమ్‌లతో ఇంగ్లండ్ ఆడనుంది. ఈ జట్లను ఓడించాలంటే ఇంగ్లండ్ తన ఆట తీరును గణనీయంగా మెరుగు పరుచుకోక తప్పదు. అప్పుడే నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News