జెరూసలెం : అరబ్ నేతల సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ పర్యటన రద్దు అయింది. గాజా ఆసుపత్రిలో జరిగిన భారీ పేలుడు వందలాది మంది ప్రాణాలను బలిగొంది.ఈ పరిస్థితితో జోర్డాన్‌లోని అమ్మన్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌కు మద్దతు కూడగట్టాలనుకున్న బైడెన్ యత్నాలకు గండిపడింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని, దీనిని అరబ్ దేశాలు సరైన విధంగా గుర్తించాల్సి ఉందని నచ్చచెప్పేందుకు బైడెన్ జోర్డాన్ పర్యటన ఖరారు చేసుకున్నారు. ఆసుపత్రిపై దాడి విషయంలో హమాస్, ఇజ్రాయెల్ సేనలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. ఈ ఘోరమైన దాడికి బాధ్యులు మీరంటే మీరేనని మండిపడుతున్నాయి. ఈ దశలో బైడెన్ బుధవారం నాటి పర్యటన రద్దు అయినట్లు అధికారికంగా వెల్లడైంది. కాగా చర్చలకు రావల్సిన అవసరం లేదని గాజా ఆసుపత్రి దాడి ఘటన తరువాత అరబ్ నేతలు బైడెన్‌కు ముందుగానే తెలియచేసినట్లు వెల్లడైంది.
ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆంక్షలు అవసరం
ఆసుపత్రిపై దాడి ఘటనను ఖండించిన ఇరాన్
ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ నేరాలు మితిమీరాయని , ప్రపంచ దేశాలు ఇకనైనా ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయి ఆంక్షలు విధించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్‌పై తగు విధంగా ఒత్తిడి పెంచేందుకు ఆ దేశంపై చమురు సరఫరాలపై ఆంక్షలు విధించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి హసియన్ అమీరబ్దుల్లాహియన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆర్గనైజెషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఒఐసి) సభ్యదేశాలకు పిలుపు నిచ్చారు. ఇంతేకాకుండా ఇజ్రాయెల్ దౌత్యవేత్తలను బహిష్కరించాల్సి ఉందన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణల నేపథ్యంలో ఒఐసి సభ్యదేశాలు బుధవారం సౌదీలోని జెడ్డాలో అత్యవసరంగా సమావేశం అయ్యాయి. గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో ఓ ప్రకటన ద్వారా ఖండించారు. చైనాలో పర్యటిస్తున్న ఆయన దేశాధ్యక్షులు జిన్‌పింగ్‌తో చర్చల తరువాత గాజా పరిస్థితిపై స్పందించారు. పేలుళ్లలో వందలాది మంది చనిపోవడం, ఇప్పటి భయానక స్థితిని తెలియచేస్తోందని పేర్కొన్న పుతిన్ , వెంటనే సంక్షోభ నివారణకు అంతా దృష్టి సారించాల్సి ఉందన్నారు.