Saturday, November 23, 2024

6 గ్యారెంటీలకు నాది హామీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర ప్రజలకు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బుధవారం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ముఖ్య అతిథిగా హజరై ప్రసంగిస్తూ సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని, కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు. రాజస్థాన్ లో ఆరోగ్య పథకం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్‌గడ్‌లో వరి ధాన్యాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యానికి ఛత్తీస్‌గడ్ ఎక్కువ ధర చెల్లించి కొంటుందని తెలిపారు. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి చూపిందని, తెలంగాణలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తామని, మేం ఏ మాట ఇచ్చామో అది నిబెట్టుకున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణలోనూ మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపుతామని దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ గెలవాలని బిజెపి,మజ్లిస్ పార్టీలుకోరుకుంటున్నాయని, కాంగ్రెస్‌ను ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ మేం నెరవేర్చామని, రాజస్ధాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి అమలు చేసి చూపినట్లు రూ.25 లక్షల వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తెలంగాణ ప్రజలు ఒకసారి కర్ణాటకకు వెళ్లి చూడాలని అక్కడ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్లోకి ఉచితంగా డబ్బు పడుతోంది. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పకుండా నిలబెట్టుకుంటుందని వెల్లడించారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఉద్యోగాలు ః ప్రియాంక గాంధీ
త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆపార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని రాజకీయ మూల్యం చెల్లించి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వివరించారు. ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారని సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు.

రాజకీయ లబ్ధికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారమని, ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి సూచించారు.
రాష్ట్రం అభివృద్ది కోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ః టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి ..
తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను సోనియా గాంధీ నేరవేర్చారని, కానీ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఆశించిన స్దాయిలో నేరవేరలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారేనని, తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి గ్యారంటీ పథకం, ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ,

రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత , ప్రతీ ఇంటికి 200 యూనిట్ల లోపు వరకు ఫ్రీ కరెంట్ అందిస్తామని, రైతులకు మద్దతు ధరతోపాటు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇవ్వాలని సోనియా గాంధీ ప్రకటించిందన్నారు. యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని, ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల సాయం అందిస్తామని, కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారం చేపడితే అటవీ చట్టాలు అమలు ః సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అటవీ హక్కుల చట్టాన్ని పూర్తి స్దాయిలో అమలు చేసి గిరిజనులను ఆదుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నట్లు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి దేశ సంపద ప్రజలకు చెందాలని నినదించిన మహా నాయకుడు రాహుల్ గాంధీని తెలిపారు. తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, సంపద వనరులు ప్రజలకు పంచడానికి ఆరు గ్యారంటీలను ప్రకటించినట్లు చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను గడప గడపకు తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని, ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు, రైతులకు ఎకరానికి రూ. 15వేల చొప్పున రైతుబంధు సాయం చేస్తాం, మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News