గరుడ సేవకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
మన తెలంగాణ / హైదరాబాద్: ఏడు కొండలు జనసంద్రంగా మారాయి. గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పొటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య గురువారం సాయంత్రం శ్రీవారి గరుడసేవ ప్రారంభమైంది. తిరుమలలో శ్రీ హరి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు తమకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు.
ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందుకెళ్తుండగా భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాల, ఇతర కళా ప్రదర్శనల నడుమ సేవల కోలాహలంగా సాగింది. భారీగా తరలి వచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. గరుడ సేవకు భారీగా భక్తులు తరలిరావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా ఏర్పాట్లు చేసింది. తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.