ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు ఉద్రిక్తతలు ఏ మాత్రం సడలక పోవడంతో గాజా ప్రాంతంలో చిక్కుపడిన లక్షలాది మంది ప్రజలకు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఇజ్రాయెల్ గాజాలోని అన్ని ప్రాంతాలపై రాకెట్ దాడులు కొనసాగిస్తుటే మరో వైపు మమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్ల వర్షం కురిపిస్తోంది.గాజా ఉత్తర ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణ ప్రాంతంలోని ‘సురక్షిత’ ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సురక్షితమని భావిస్తున్న దక్షిణ ప్రాంతంపైన కూడా ఇజ్రాయెల్ రాకెట్ దాడులు కొనసాగిస్తుండడంతో ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. వేలాది మంది పాలస్తీనియన్లు తలదాచుకున్న ఖాన్ యూనిస్‌నగరంలోని ఓ నివాస భవనంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ల వర్షం కురిపించింది. తమ ఆస్పత్రికి కనీసం 12 మృతదేహాలు, గాయపడిన 40 మంది వచ్చినట్లు నగరంలోని నాస్సెర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
గాజాలోకి పరిమిత స్థాయిలో మానవతా సాయాన్ని అందించడానికి ఈజిప్టుకు ఇజ్రాయెల్ అనుమతించిన తర్వాత ఈ బాంబుదాడులు జరగడం గమనార్హం. గాజాలోని దాదాపు 23 లక్షల మందిలో చాలా మంది ఇప్పుడు రోజుకో పూట తిండితో, మురికి నీరు తాగుతూ బతుకులు వెళ్లదీస్తున్నారు. గాజాలోని అల్ అహ్లి ఆస్పత్రిలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మధ్య ప్రాచ్యంలోని ముస్తిం దేశాలతో పాటుగా పలు దేశాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకిన తర్వాత గాజాలోకి ఆహారం, తాగునీరు, మందులు లాంటి ఇతర నిత్యావసరాలు తీసుకువెళ్లే ప్రణాళికకు అనుమతి లభించింది. ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో మానవతా సాయంతో వందలాది ట్రక్కుల ఈజిప్టుఇజ్రాయెల్ సరిహద్దుల్లోని రఫా పాయింట్ వద్ద గత కొన్ని రోజులుగా ఆగి పోయి ఉన్నాయి. అవి ఇప్పుడు కదిలేందుకు మార్గం సుగమం అయింది.
ఆస్పత్రి పేలుడుతో మాకు సంబంధం లేదు: ఇజ్రాయెల్ సైన్యం
ఇదిలా ఉండగా ఆస్పత్రిలో పేలుడుపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర నిందలు మోపుకుంటున్నాయి. దాదాపు 500 మందిని బలిగొన్న కిరాతకులు మీరంటే మీరని నిందించుకుంటున్నాయి ముమ్మాటికీ ఇజ్రాయెలే ఈ ఘోరానికి ఒడి గట్టిందని హమాస్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం తోసిపుచ్చింది. ఇస్లామిక్ జిహాద్ ప్రయోగించిన రాకెట్ గురితప్పడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడిఎఫ్) ప్రతినిధి లెఫ్టెనెంట్ కల్నల్ జొనాథన్ కోర్నికస్ ఓ వీడియో ప్రకటనలో మరోసారి స్పష్టత ఇచ్చారు.ఆ పేలుడుతో తమకు సంబంధం లేదన్నారు. పేలుడు సంభవించిన సమయంలో తాము ఆ ప్రాంతంపై ఎలాంటి దాడులు చేయలేదన్నారు. మంగళవారం సాయంత్రం 6.59 గంటల సమయంలో సమీపంలోని ఓ స్మశాన వాటిక
నుంచి పాలస్తీనా మిలిటెంటు గ్రూపు అయిన ఇస్లామిక్ జిహాద్ గ్రూపు సభ్యులు రాకెట్ ప్రయోగించినట్లు తమ రాడార్ గుర్తించిందన్నారు. ఆ రాకెట్ గురితప్పి ఆస్పత్రి వెలుపల కారు పార్కింగ్ స్థలంలో పేలిందని చెప్పారు. మంటలు మాత్రమే వచ్చాయి అని, ఎవరూ చనిపోయినట్లుగా చిత్రాల్లో ఎక్కడా లేదని చెప్పారు. తమ రాకెట్లు చాలా శక్తివంతమైనవని, అవి పేలితే పెద్ద గొయ్యి ఏర్పడుతుందని, అయితే అలాంటిదేమీ జరగలేదని కూడా ఆయన చెప్పారు. హమాస్ చెప్తున్నట్లుగా దాదాపు 500 మంది చనిపోయి ఉంటే మృత దేహాలు ఎక్కడని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే మృతదేహాలు నేలపై చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు, క్షతగాత్రులను బంధువులు చేతులమీద ఎత్తుకుని తీసురెళ్తున్న వీడియో చిత్రాలు మీడియాలో వచ్చాయి. అంతేకాకుండా డాక్టర్లు నేలపైనే సర్జరీలు చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.
రోజురోజుకు పెరుగుతున్న మరణాలు
కాగా గత 13 రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరువైపులా వేలాది మంది చనిపోగా, అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటినుంచి గాజాలో 3.785 మంది చనిపోయారని హమాస్ ఆరోగ్య వాఖ ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులేనని తెలిపింది. మరో 12,500 మందికి పైగా గాయపడ్డారని, భవనాల శిథిలాల కింద 1300 మందికి పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపింది. మరో వైపు హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు 1400 మందికి పైగా చనిపోగా, వారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. దాదాపు 200 మంది హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.