20వ శతాబ్దం తొలిరోజుల్లో మొదలైన వచన కవిత్వం దారి తెన్ను లేకుండా అయోమయదారుల్లో ఊరేగుతున్న తరుణంలో ‘నినాదాల కవిత్వం బహుమతుల కవిత్వం కింద నలిగి కొట్టుకుంటున్న జనం ‘బాధల్ని గమనించి గుంటూరు శేషేంద్రశర్మ రాసిన కవిత్వానికి గీటురాయిలాంటి లాక్షణిక రచన ‘కవిసేన మేనిఫెస్టో’. దేశంలో ఎమర్జెన్సీ ఇంకా కొనసాగుతున్న కాలంలో అంటే 1977లో ఈ ఆధునిక కావ్యశాస్త్రం వెలువడింది. అప్పటికే ‘వచనపు ఎండుగడ్డి వేసి ప్రజల్లో కవిత్వపు స్పృహను చంపేస్తున్న’ కవుల తీరు చూసి విసిగిపోయిన శేషేంద్ర ఒకింత తీవ్రమైన పదజాలంతోనే ఈ కావ్యశాస్త్రాన్ని రచించాడు. ఒక్కోసారి విపరీతమైన ఆవేదనతో తిట్లకు కూడా దిగాడు. ఇదంతా దినపత్రికల్లాంటి ప్లెయిన్ ప్రోజ్ రాస్తున్న కవులను మరమ్మత్తు చేయడానికే. ఏ మాత్రం కవితా శిల్పం లేకుండా పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న వచన కవిత్వాన్ని చూసి ‘వట్టి శబ్దాలు కవిత్వం కాదని’ ఆధునిక వచన కవులకు తేల్చి చెప్పడానికి ఈ కావ్యశాస్త్రంలో ప్రయత్నించాడు. కవిత్వమంటే సాదా వచనం కాదని, వట్టి వచనం దోషమని విద్యానాథుడు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు.
ముందు ‘కవిత్వమంటే ఏమిటో తెలుసుకోకుండా ఇక్కడి వాళ్లవిగానీ, అక్కడి వాళ్లవిగానీ మహాకవుల రచనా శిల్పమర్మాలు పరిశీలించకుండా, గ్రహించకుండా ఒకడు కవితా విద్య పొందగలడా? అనేదే ప్రశ్న. కవికి అతి విశాలమైన అధ్యయనం కావాలి’ అన్నాడు. ‘మన పూర్వ కవులు అంత మంచి కవిత్వాన్ని రాయడానికి ఎంత ధ్వంసం చేసుకున్నారో వాళ్ల జీవితాన్ని’ అనేది గ్రహించాలన్నాడు. కవిత్వ ఉత్పత్తిలో సాధక బాధకాల్ని, లోతుపాతుల్ని తెలుసుకోవాలన్నాడు. మనిషి మరో మనిషిగా మారి జగత్తును ఉపాసిస్తేనే ఇది సాధ్యమని నొక్కి చెప్పాడు. కవిత్వం జీవితానికి రూపాంతరమని తెలుసుకుంటేనే కవి జీవితంతో మమేకమవుతాడని అప్పుడే సిసలైన కవిత్వం పురుడుపోసుకుంటుందని చెప్పాడు. ‘మానవ జీవితాన్ని జీర్ణించుకొని ఆ బలంతో ఒక మాట చెప్పడం సాహిత్యం’ అన్నాడు. అంటే కవులు రాసే కవిత్వం ఎంత జీవిత గాఢతను నింపుకొని ఉండాలో మనం గ్రహించాలి. కవిత్వం చదివితే అమృతం తాగినట్టుండాలి, ఆముదం తాగినట్టు కాదు అని ఉబలాటపు కవులకు ఎన్నో వాతలు పెట్టాడు ఈ గ్రంథంలో. ‘సాహిత్యశాస్త్రం మొదటి నుంచి ఈ దేశంలో ఉంది. అందుకే కవుల మీద మరింత బాధ్యత ఉంది’ అని కవులకు దిక్సూచిలా నిలిచాడు.
‘కవిత్వమే కవి ఆయుధం. కవే దేశానికి అసలు నాయకుడు. కవి సరాసరి మానవ జాతికి బాధ్యుడు’ అన్నాడు. ‘కవి బాధ్యత రాజకీయపరమైన బాధ్యత కంటే గురుతరమైనది. కవికి రాజకీయాతో సంబంధం ఉంటుంది కాని రాజకీయ పార్టీలతో కాదు’ అని కవి రాజకీయవాది కంటే ఉన్నత స్థాయిలో తన పాత్రను నిర్వహించాలని సూచించాడు. కవి అనేవాడు స్వేచ్ఛగా రాయాలని, ఎలాంటి సంకెళ్లలో బంధీ కావద్దని ఆశించాడు శేషేంద్ర. ‘కవి పూలతో పోట్లాడుతాడు. పూల తోటలతో పోట్లాడుతాడు. మేఘాలతో పోట్లాడుతాడు. తుఫానులతో పోట్లాడుతాడు. పోట్లాట వాడు బతకడానికి పీల్చే ఊపిరి’ అని కవి ఎల్లవేళలా పోరాటం వైపు నిలబడాలని ఆకాంక్షించాడు.‘కవి సత్యాగ్రాహి. సత్యమంటే వెసూవియస్ అగ్నిపర్వతమని. గొంతులో గర్జించే నయాగరా జలపాతమని. సత్యాగ్రహం చచ్చిందీ దేశంలో. మళ్లీ బతికించాలి మనం. తెలుగు దేశంలో కవిత్వం రాజకీయాలకు మారుపేరయింది. సొంత లాభాలకు రూపాంతరం అయింది. కనుకనే రాజకీయవాదులు, స్వలాభపరులు కవిత్వపు బురఖాలు ధరించి ప్రజల్ని మోసం చేస్తున్నారు.
ఈ బురఖా కవులు రాజకీయవాదుల ఆస్థాన విదూషకులు. వాళ్ల భోజనపు టేబిళ్ళ నుంచి రాలే మెతుకుల కోసం నేలకరుచుక్కూచుని ఉన్న క్షుద్ర జీవులు. ఈ జీవులు ప్రజల్ని ఎలా కదిలించగలరు. వాళ్లకి దేశం మీద ఎలాంటి జిజ్ఞాస ఉండగలదు? అభ్యుదయం అంటే అధికార్ల పాదసేవ కాదు. దాన్ని తిరస్కరించడం. ఆ చేవలేనివాడు కవి కాదు దొంగ’ అని బూటకపు కవుల నైజాన్ని ఉతికి ఆరేశాడు. అంతేకాదు ‘కవిత్వం అంటే ఒక జీవన విధానమే గానీ బతుకు తెరువు కాదు’ అని స్వార్థపు కవుల, కీర్తికండూతి కవుల నెత్తి మీద మొట్టికాయలు వేశాడు. ‘ఈనాడు చరిత్రలో మనిషి ఎక్కడున్నాడన్న స్పృహ లేనివాడు ఆధునిక కవి ఎట్లా అవుతాడు. అజ్ఞాన కవి అవుతాడు’ అని కవికి ఉండాల్సిన కనీస కాలిక స్పృహను అర్థం చేయించాడు. ‘మీ భావాలు ఎప్పుడూ ఎవరి కాళ్లూ నడవని దేశాలుగా ఉండాలి’ అని, కవి ఎప్పుడూ నూతన భావాలను కలిగి ఉండాలని చెప్పాడు. వీటితో పాటు ‘మనిషే కాలేనివాడు కవి ఎట్లా అవుతాడు?’ అని ప్రశ్నించాడు. అంటే కవిత్వం రాయాలంటే ముందు మనిషిగా జీవించాలి. మనిషిగా స్పందించాలి. ఇవాళటి స్పందనలేని యాంత్రిక తరాన్ని ముందే ఊహించాడు శేషేంద్ర.
కవి ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? ఏ నిబద్ధత కల్గియుండాలని చెప్పడంతోపాటు కవిత్వం ఎలా ఉండాలో కూడా అనేక సూత్రీకరణలు చేశాడు ఈ ఆధునిక ఆలంకారిక గ్రంథంలో శేషేంద్ర.
‘కవిత ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. ఒక మారణాస్త్రంలా ఉండాలి. పట్టుకుంటే చస్తామేమో అనే భయం కలిగించాలి. చదివి పాఠకుడు చావాలి. కొత్త జన్మ ఎత్తాలి. అదీ పరమార్థం. పుస్తకం చదివిన తరువాత కూడా పాఠకుడు పాత పాఠకుడుగానే ఉండిపోతే ఆ పుస్తకాన్ని నిప్పుల్లో పారెయ్యండి. తక్షణ మరణాన్ని, పునర్జన్మనూ ప్రసాదించ లేని పుస్తకం పుస్తకం కాదు. తేదీలు ఘోషిస్తూ గోడ మీద వేలాడే క్యాలండర్’ అని కవిత్వం లేదా కవితా సంపుటి తీసుకు రావాల్సిన రసాయనిక చర్యను మన గుండెల మీద లావాలా పొంగిపొర్లేటట్లు చేశాడు. ‘కవిత్వం మనిషితో కలవాలి. మనుష్యుల జీవన్మరణ సమస్యలతో మిళితం అయిపోవాలి’ అని కవితా లక్ష్యాన్ని గుర్తు చేశాడు. ‘జీవితం అందరి మీద లాగే కవి మీద కూడా సామాజిక స్పృహ విధిస్తుంది. ఎవడ్నీ ఆ స్పృహ విడిచిపెట్టదు. కాని కవి చేసే విశిష్ట కార్యం దాన్ని కవిత్వీకరించడం’. ‘ఇంత విస్తృత చైతన్యాగ్ని జ్వాలల్లో నిత్యమూ దగ్ధమవుతున్న కవి సామాజిక చైతన్యమూ, వస్తువు అనేవి సమస్యలు కావు. ఇప్పుడు ప్రధాన సమస్య కవులు ఏం చెప్తున్నారనే దానితో కాదు కవిత్వంగా చెప్పడం లేదన్న దానితోనే’ అంటాడు ఒకచోట.
ముఖ్యంగా ఈ గ్రంథం నిండా శేషేంద్ర ఆక్రోశమంతా కవితా శిల్పం గురించి. శిల్పం, టెక్నిక్‌లేని కవిత్వాన్ని శేషేంద్ర ఊహించలేడు. ఏమి చెప్పావన్నది కాదు ఎలా చెప్పావన్నది చాలా ప్రధానమైందని చెప్పాడు. ‘కవిత్వానికి ఆదర్శమూ ముఖ్యము. ఆకర్షణా ముఖ్యము. కవిత్వం అంటేనే ఆకర్షణీయ వాక్కు’ అన్నాడు.‘విశిష్టమైన భావం, విశిష్టమైన భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు’ అని ప్రతి కవికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణం గురించి చర్చించాడు. ‘శబ్దాలు తమంతట తామే అస్తిత్వం కలిగినవి కావనీ, వాటికి కవి తన ఊపిరి పోస్తాడనీ, ఆ ఊపిరితోనే అవి బతుకుతాయి, తిరుగుతాయి, మాట్లాడుతాయి, పోట్లాడుతాయి.వాటికి చెప్పిన పనులు అవి చేసుకుంటాయి’ అని కవిత్వానికి ఉండాల్సిన బలాన్ని, ఆ బలం ఎక్కడి నుంచి శబ్దాలకు కలుగుతుందో ఉదాహరణ యుక్తంగా వివరించాడు. ఇంకా ‘రాళ్లకు వాటితో కట్టిన దేవాలయం ఏమిటో తెలియదు. అట్లాగే శబ్దాలకు వాటితో నిర్మించిన కవిత్వం ఏమిటో తెలీదు’ కాబట్టి ఆయా శబ్దాలకు ప్రాణశక్తిని ధారపోసేది కవేనంటాడు. ‘శక్తిరహితమైన సామా న్య శబ్దం మనిషిని ఏమీ చేయలేదు’ అని కవి శబ్దానికి వింత శక్తిని ఆపాదించాలని చెప్పాడు. ‘కవి లక్ష్యం ఎప్పుడూ వాడబడిన వాటిని వాడకపోవడం.
ఈ ఒక్క కిటుకు చేతనే కవి నూతనత్వం సాధిస్తాడు. ఇది అతి ప్రాణతుల్యమైన విషయం. కారణం కవిత్వం కొత్తదనం మీదనే బతుకుతుంది. కొత్తదనం మీదనే పుడుతుంది. ‘సాధారణ వ్యక్తి శబ్ద ఉపరితలాన్నే వాడుకుంటున్నాడు’.దానికి భిన్నంగా కవి శబ్దశక్తిని గ్రహించి నూతన ప్రయోగాలు చేయాలని చెప్పాడు. అందుకే కవికి భిన్నమైన చూపుండాలి. అంటే సెకండ్ విజన్ ఉండాలన్నాడు. కొన్నిసార్లు ‘సామాన్య భాషను విచిత్రంగా వాడడం కూడా కవిత్వంగా భావింపబడుతుందని అభిప్రాయపడ్డాడు. ‘సామాజిక చైతన్యం ముసుగు కింద వీరవిహారం చేస్తున్న శిల్పరహిత అకవిత్వ మలినాన్ని దేశం నుంచి క్షాళనం చేయాలి’ అని పిలుపునిచ్చాడు. విమర్శకుడు ఎలా ఉండాలో, అతడి బాధ్యతలేమిటో కూడా చాలా సందర్భాల్లో చర్చించాడు ఈ గ్రంథంలో. ‘సాహిత్య విమర్శకుడు తన విమర్శనా వస్తువైన కవితలో వ్యుత్పన్నత ఎన్ని పాళ్లు ఉంది అని ముందు పరీక్షించాలి’ అని విమర్శకుని ప్రథమ కర్తవ్యాన్ని చెప్పాడు. అయితే ‘వ్యుత్పత్తి’ అంటే ఏమిటో అనేక నిర్వచనాలను ఉదాహరిస్తూ ‘ఉచితానుచిత వివేకో వ్యుత్పత్తి:’ అని నిర్వచించిన రాజశేఖరుని నిర్వచనాన్ని ప్రధానంగా ఉటంకించాడు.‘నిజం చెప్పడానికి ముందడుగు వెయ్యని విమర్శకుడు ఆ రంగంలో వెనకబడిపోతాడు’ అని హెచ్చరించాడు.
1970 తరువాత ఆవిర్భవించిన వివిధ రచయితల సంఘాలలో కొద్ది సంవత్సరాలలోనే లుకలుకలు తలెత్తాయి.కొందరు కవులు ఆయా సంఘాల సభ్యత్వానికి రాజీనామా చేసి ఏకాకిగా మిగిలారు లేదా ఇతర సంఘాలలో చేరిపోయారు. మరి కొందరు జైళ్లలో మగ్గిపోయారు. కొంతమంది కవులు ప్రజల పక్షం నిలవకుండా ప్రభుత్వానికి అనుకూలంగా కవిత్వం, పాటలు రాశారు. 80, 90 దశకాలు వచ్చేసరికి తెలుగు నేల మీద ఆయా అస్తిత్వవాదాలు బయలుదేరి అనేక వేరు కుంపట్లు ఏర్పడ్డాయి. ఆయా రచనలు కొద్ది మేర ప్రభావితం చేసినా తేవాల్సిన మార్పును తేలేదు. రావాల్సిన విప్లవం రాలేదు. ఈ పరిణామాలన్నీ ఆయా సంఘాల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపాయి. దీనికి గత ఐదు దశాబ్దాలు కాలమే సాక్ష్యం. కవిసేన మేనిఫెస్టో విడుదలై యాభై ఏళ్లు కావస్తోంది. ఇందులో విషయ గాఢత కన్నా తిట్ల గాఢత ఎక్కువైందని విమర్శించిన వారు లేకపోలేదు.
అయితే అలా విమర్శించిన విమర్శకులుగానీ, రచయితల సంఘాలుగానీ ఈ యాభై ఏళ్లలో తమదైన సాహిత్య సిద్ధాంతాలుగానీ, కావ్యశాస్త్రాన్నిగానీ ప్రకటించలేదు. కారణం అందుకు తగిన పరిశ్రమ చేసే సత్తువ లేకనే అని ఈ యాభై ఏళ్ల సాహిత్యానుభవం నిరూపించింది. ఈ యాభై ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్ర కవిసేన మేనిఫెస్టో ప్రతిపాదించిన మౌలిక సూత్రాలను బలపరుస్తున్నది. కవులు ప్రజల కోసం ఏడవాలి. ప్రజలకు నిబద్దులై ఉండాలి కానీ పార్టీలకు కాదన్న కవిసేన మేనిఫెస్టో మూల సిద్ధాంతాన్ని రుజువు చేసింది.