Friday, November 22, 2024

చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడుకు నవంబర్ 1 వరకు విజయవాడ ఏసిబి కోర్టు రిమాండ్ పొడిగించింది . ఎపి సిఐడి న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు మరింత ఎక్కవసార్లు కలిసే అవకాశం కల్పించాలని న్యాయవాదులు ఎసిబి కోర్టును కోరారు. ఎసిబి కోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చంద్రబాబుపై నమోదుచేసిన కేసుల విచారణ సాగుతోందని, దీనిపై చంద్రబాబుతో చర్చించాల్సిన అవసరం వుంటుందన్నారు. అందుకోసమే లీగల్ ములాఖత్‌ను వారానికి మూడుసార్లు ఇవ్వాలంటూ ఎసిబి కోర్టులో చంద్రబాబు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.

న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తే రాజమండ్రి జైలు అధికారులు అంగీకరించడం లేదని ఎసిబి కోర్టుకు తెలిపారు లాయర్లు. జైలు అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించకుండా చూడాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. లాయర్ల లీగల్ ములాఖత్‌ను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని ఎసిబి కోర్ట్ న్యాయమూర్తి తెలిపారు. అయితే కేసు విచారణ సందర్భంగా చంద్రబాబును జైలు నుండే వర్చువల్ గా ఎసిబి ఏసిబి కోర్టులో అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా జైల్లో తన సెక్యూరిటీ, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన తనకు జైల్లో ఆ స్థాయి భద్రత కల్పిస్తున్నట్లు కనిపించడం లేదని, దీనిపై పలు అనుమానాలున్నాయని న్యాయమూర్తికి తెలిపారు. అయితే ఈ విషయంపై తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఎసిబి కోర్టు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని రాజమండ్రి జైలు అధికారులకు జడ్జి ఆదేశించారు.

ఇక చంద్రబాబు ఆరోగ్యం గురించి రాజమండ్రి జైలు అధికారులను ఎసిబి జడ్జి అడిగారు. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. తనకు ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందిపడుతున్న విషయాన్ని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు. చికిత్స చేసేందుకు వైద్యుల బృందం ఉన్న విషయాన్ని ఎసిబి జడ్జి చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు స్కిన్ సమస్యపై దృష్టి పెట్టాలని వైద్యులను ఎసిబి కోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News