Monday, December 23, 2024

గర్భిణికి బరువు భారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గర్భిణులు బరువు పెరగడం ఆ తరువాత వారి జీవితాలకు ప్రాణాంతకం అవుతుంది. క్రమేపీ వారు గుండెజబ్బులు లేదా మధుమేహం వంటి వాటితో ఆరోగ్య క్లిష్టతను తెచ్చుకుంటారు. సమగ్ర అధ్యయనం తరువాత వెల్లడైన ఈ విషయాన్ని వైద్యశాస్త్ర విశ్లేషణాత్మక పత్రిక ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. సాధారణంగా స్థూలకాయం ప్రతి ఒక్కరికి ఇబ్బందికర పరిణామాలను తెచ్చిపెడుతుంది. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరిగితే , మామూలుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటే ఇది గుండె, రక్త ప్రసరణలపై ప్రభావం చూపుతుంది. పలు రకాలుగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వివిధ స్థాయిల్లోని స్థూలకాయుల ఆరోగ్య పరిస్థితి గురించి యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వెనియా వైద్యశాస్త్ర విభాగం పరిశోధకులు అధ్యయనం చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. గర్భం దాల్చడానికి ముందు తక్కువ బరువు, సాధారణ బరువు, స్థూలకాయం ఉన్న మహిళలను వేర్వేరుగా వర్గీకరించి , గర్భం దాల్చిన తరువాత వారిలో పెరిగిన బరువు , ఆ తరువాత వారికి ప్రాణాంతకంగా మారిన జబ్బుల గురించి పరిశోధనలు జరిగాయి.

ఇందులో భాగంగా అమెరికాలోని 45000 మంది మహిళల 50 సంవత్సరాల ఆరోగ్య స్థితిని పలు దశలుగా విశ్లేషించుకున్నారు. గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక బరువును సంతరించుకోరాదు. సరైన వైద్య మార్గదర్శకాలతో దీనిని నివారించుకోవచ్చు. దీని వల్ల ఆ తరువాతి ప్రాణాంతక పరిస్థితి నివారణకు వీలుంటుందని అధ్యయనానికి సారధ్యం వహించిన గైనకాలజీ, ఒబెస్ట్రిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టెఫనీ హింక్లీ తమ పరిశోధనా పత్రంలో తెలిపారు. సరైన నివారణ చర్యలు తీసుకుంటే ప్రసవానంతర ఆరోగ్యం, శిశువు ఎదుగుదలకు దోహదం చేస్తుంది. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సిడిసి) పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భవతులు ఎంత మేరకు బరువు సంతరించుకోవచ్చు? ఏ స్థాయిలో బలహీనత ఉండరాదనే విషయాలపై గైడ్‌లైన్స్ ఖరారు చేశారు. తక్కువ బరువుతో ఉండే మహిళలు గర్భం దాల్చినప్పుడు 12.5 నుంచి 18 కిలోలు మించి బరువు పెరగరాదు. ఇక ముందు నుంచే స్థూలకాయులుగా ఉన్న మహిళలు గర్భం దశలో 5 నుంచి 10 కిలోలు మించి బరువు పెరుగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలను ప్రాతిపదికగా చేసుకుని అధ్యయనం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News